రసాయనిక, ఆయిల్ విపత్తులకు ఎదుర్కొనే వ్యూహం?
x

రసాయనిక, ఆయిల్ విపత్తులకు ఎదుర్కొనే వ్యూహం?

ఏపీలో మే మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా రసాయనాలు, గ్యాస్, ఆయిల్ వంటి ప్రమాదకర పదార్థాలు వినియోగించే పరిశ్రమల్లో మాక్ ఎక్సర్‌సైజ్ జరుగుతుంది.


రాష్ట్రంలో రసాయనాలు, గ్యాస్, ఆయిల్ వంటి ప్రమాదకర పదార్థాలు వినియోగించే పరిశ్రమల్లో అత్యవసర పరిస్థితులకు సిద్ధమవ్వడానికి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) ఆధ్వర్యంలో మే నెల మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మాక్ ఎక్సర్‌సైజ్ ప్రభుత్వం నిర్వహించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారంతో జరిగే ఈ వ్యాయామం రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 22 ప్రమాదకర పరిశ్రమల్లో జరుగుతుంది.

ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ద్వారా పరిశ్రమ యాజమాన్యాలు, సమీప ప్రాంత ప్రజలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో స్పందించే విధానాలను మెరుగుపరచడం, ప్రమాద తీవ్రతను తగ్గించడం, ప్రాణ-ఆస్తి నష్టాన్ని నివారించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్ విపత్తులను ఎదుర్కోవడంలో మరింత అప్రమత్తంగా ఉండేలా ఈ కార్యక్రమం రూపొందించామని ఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్‌తో శుభారంభం

ఈ సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 15 జిల్లాల కలెక్టర్లు, ఇన్సిడెంట్ కమాండర్లు, రెస్క్యూ బృందాలు, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య, విద్య, రవాణా శాఖల అధికారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సర్వీసెస్‌తోపాటు వివిధ శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు. త్వరలో జరగనున్న ఫీల్డ్ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన విధి-విధానాలు, మార్గదర్శకాలను అధికారులకు వివరించారు.

ఎన్‌డీఎంఏ సీనియర్ కన్సల్టెంట్ (రిటైర్డ్ కమాండెంట్) ఆదిత్య కుమార్ విశాఖపట్నంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద జరిగే మాక్ ఎక్సర్‌సైజ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎస్‌డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహనరావు, సిబివో రామాయణపు తనూజ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏ జిల్లాల్లో ఏ పరిశ్రమలు?

శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్‌టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని మొత్తం 22 పరిశ్రమలు ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌లో భాగం కానున్నాయి. జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యాయామం జరుగుతుందని అధికారులు తెలిపారు.

విపత్తుల నిర్వహణలో కీలక మైలురాయి

రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనను అందించడం ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ప్రధాన లక్ష్యమని ఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. “ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో చెప్పలేము. కానీ సన్నాహాలు మాత్రం ఉండాలి. ఈ వ్యాయామం ద్వారా మన సామర్థ్యాలను మరింత పెంపొందించుకుని, ప్రజల భద్రతను ఉన్నత స్థాయిలో కాపాడగలము” అని అన్నారు.

ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ఫలితాలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ వ్యవస్థను మరింత దృఢం చేస్తాయని, ప్రజలు, పరిశ్రమలు సురక్షితంగా ఉండే వాతావరణం కోసం ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More
Next Story