
ఏపీ-సింగపూర్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
సింగపూర్ మాదిరి అమరావతిని నిర్మించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసి, దాన్ని భారతదేశానికే మోడల్‌గా నిలబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా సింగపూర్‌తో కీలక చర్చలు జరిపిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రపంచ బ్యాంకు మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు.
సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ప్రతినిధులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, “మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం” అని చెప్పారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఆసక్తి ఉన్న భాగస్వాములను ఆహ్వానిస్తూ ఇప్పటికే RFP నోటిఫికేషన్ జారీ చేశామని, జాతీయ చట్టబద్ధత లభించడంతో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో అమరావతి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌తో పాటు, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్లోబల్ MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సింగపూర్ సన్‌టెక్ సిటీని అధ్యయనం చేసి ఏపీలో అలాంటి వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా-తూర్పు ఆసియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో సింగపూర్ ద్వారా ఏపీ హబ్‌గా మారాలనేది రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు.
గత నవంబర్‌లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU) అమలు పురోగతిని సమీక్షించడానికి జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC), జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (JIWC)లను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా విధివిధానాలను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని లోకేష్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నెలవారీ సంప్రదింపులు జరుగుతున్నాయని, ఏపీ మంత్రులు SAGE కార్యక్రమం ద్వారా సింగపూర్‌లో శిక్షణ పొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల 37 మంది ఏపీ ఉపాధ్యాయులు కూడా సింగపూర్ శిక్షణను పూర్తి చేసుకున్నారని తెలిపారు.
సమావేశంలో సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశాంగశాఖ మంత్రి గాన్ సియో హువాంగ్, సీనియర్ అధికారులు ఫ్రాన్సిస్ చోంగ్, టే లియాన్ చూ, ఆడ్రీ టాన్ తదితరులు పాల్గొన్నారు. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారులు పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్ కూడా ఈ చర్చల్లో భాగం వహించారు.

