శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి తరలింపు ఆపండి...
x
శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫోటొ)

శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి తరలింపు ఆపండి...

రాయలసీమలో దాహంతో అలమటించే పరిస్థితులు సృష్టించవద్దని రైతు సంఘాల వినతి.


రాయలసీమలో తాగునీరు, ఆరు తడి పంటలకు నీటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలక సమయం కావడం వల్ల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి తరలింపు ఆపాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటి తరలింపు నిలుపుదల చేయకుంటే మరింత తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సమితి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల నిర్వహణపై KRMB, CWC సమావేశాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా ఈ సమస్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి, శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపాలని బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తోపాటు ఆ సంస్థ ప్రతినిధులు ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌ను గురువారం కలిసి జల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

"ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తక్షణమే తీసుకెళ్లి, రాయలసీమ నీటి భద్రతకు అత్యవసర చర్యలు చేపట్టండి" అని దశరధరామిరెడ్డి కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నీటి నిర్వహణ కారణంగా రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నీటి తరలింపు ఆపండి

శ్రీశైలం జలాశయంలోని నీటిని రాయలసీమ అవసరాలకు ముందుగా భద్రపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సాగునీటి సాధన సమితి ప్రతినిధులు గుర్తు చేశారు.
"రాయలసీమకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం. రిజర్వాయర్లలో తగిన నీటి నిల్వలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం ఇప్పటికే తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది" అని సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
"శ్రీశైలం నుంచి తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలతో నాగార్జునసాగర్‌కు చేరే నీటిని ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటాయి" అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు బొజ్జా దశరధరామిరెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు.
"రాయలసీమ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా, అనాలోచిత నీటి నిర్వహణ విధానాన్ని ఎత్తి చూపుతోంది" అని బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.

అవసరానికి మించి సాగర్‌కు నీటి తరలింపు

ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిన నేపథ్యంలో, అక్టోబర్ 2026 వరకు ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల వరకు ఆంధ్రప్రదేశ్ తన తాగునీటి అవసరాల కోసం సుమారు 47 టీఎంసీల నీటికి KRMBకి ఇండెంట్ ఇచ్చింది. అందులో నాగార్జునసాగర్‌కు తరలించాల్సిన నీటి పరిమాణం సుమారు 14 టీఎంసీలుగా పేర్కొన్నారు. తెలంగాణ వాటా కింద నాగార్జునసాగర్‌కు వెళ్లే నీటిని కలుపుకుంటే, రెండు రాష్ట్రాల అవసరాల మేరకు సుమారు 25 నుంచి 26 టీఎంసీల పరిధిలోనే నీటి తరలింపు ఉండాలి. ఇప్పటికే
"శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటికే సుమారు 53 టీఎంసీల నీరు నాగార్జునసాగర్‌కు తరలించారు" అని బొజ్జా వివరించారు.
“రాయలసీమకు నీటి నిల్వలను కాపాడాల్సిన సమయంలో, అవసరానికి మించి శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేయడం భవిష్యత్తులో తీవ్ర తాగు నీటి సంక్షోభానికి దారితీస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి కోసం ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది" అని బొజ్జా దశరథరామిరెడ్డి హెచ్చరించారు.

గత ఏడాదే తప్పిదం జరిగిందా?

శ్రీశైలం జలాశయంలోకి గత ఏడాది చేరిన నీటిని క్యారీ ఓవర్ నిల్వగా భద్రపరిచలేదు. ఉంటే, ఈ ఏడాది వచ్చిన నీటితో కలిపి సుమారు 350–400 టీఎంసీల నీటిని సమర్థవంతంగా నియంత్రించుకుని, రాయలసీమతో పాటు రాష్ట్ర అవసరాలను మెరుగ్గా తీర్చే అవకాశం ఉండేదని సాగు నీటి సాధన సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది నీటి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో తగినంత నీటి భద్రత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.
ఆ సమితి ప్రతినిధులు ఇంకా ఏమన్నారంటే...
“రాయలసీమ ప్రయోజనాలపై ప్రభుత్వ వైఖరి మారాలి. శ్రీశైలం జలాశయంలో నీటిని నిల్వ ఉంచడం, రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించడం, తాగునీటి భద్రతను కాపాడడం. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత కావాలి“ అని గుర్తు చేశారు.
శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీటిని కూడా “సమిష్టిగా వినియోగించుకుంటాం” అనే ప్రభుత్వ వైఖరి, రాయలసీమ ప్రత్యేక అవసరాలు, నీటి హక్కులను విస్మరించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
“రాయలసీమ, వెనుకబడిన జిల్లాలపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలను కాపాడి, రాయలసీమ తాగునీరు, ఆరుతడి పంటలకు నీటి భద్రత కల్పించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే నిర్ణయాలకు స్వస్తి పలకాలి” అని బొజ్జా డిమాండ్ చేశారు.
Read More
Next Story