ఏ రోజు చెత్త.. ఆ రోజే విద్యుత్‌గా మార్చే వ్యవస్థ వైపు అడుగులు
x

ఏ రోజు చెత్త.. ఆ రోజే విద్యుత్‌గా మార్చే వ్యవస్థ వైపు అడుగులు

డంపింగ్‌ యార్డ్‌ రహిత ఏపీ.. అక్టోబర్‌ 2 నాటికి లెగసీ వేస్ట్‌ తొలగింపు.


ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో రోజూ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను డంపింగ్‌ యార్డుల్లో పోగుచేయకుండా, అదే రోజు సేకరించి ప్రాసెస్‌ చేసి విద్యుత్‌గా మార్చే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో ఆరు కొత్త వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ, ఇప్పటికే పనిచేస్తున్న విశాఖ, గుంటూరు ప్లాంట్లతో పాటు ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి మొత్తం చెత్తను ప్లాంట్లకే తరలించి, భూమిపైన, భూమిలోపల ఉన్న లెగసీ వేస్ట్‌ను కూడా తొలగించి రాష్ట్రాన్ని డంపింగ్‌ యార్డ్‌ రహిత మున్సిపాలిటీల రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గత ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. భూమిపైన పేరుకుపోయిన చెత్తను ఇప్పటికే పూర్తిగా తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. భూమిలోపల ఉన్న వ్యర్థాలను కూడా అక్టోబర్‌ 2 నాటికి పూర్తిగా క్లియర్‌ చేయాలని స్పష్టం చేశారు. గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలోని మున్సిపాలిటీలను డంపింగ్‌ యార్డ్‌ రహితంగా మార్చే లక్ష్యంతో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పురపాలక శాఖ లెగసీ వేస్ట్‌ తొలగింపును ప్రాధాన్యతగా చేపట్టింది. భూమిపై కనిపించే చెత్త కుప్పలను బయో మైనింగ్‌, ప్రాసెసింగ్‌ ద్వారా ఇప్పటికే క్లియర్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భూమిలోపల పాతిపెట్టినట్లుగా గుర్తించిన వ్యర్థాలను అక్టోబర్‌ 2లోపు పూర్తిగా తొలగించాలని లక్ష్యం నిర్దేశించారు. ప్రాసెసింగ్‌ తర్వాత వచ్చే ఆర్‌డీఎఫ్‌ను సిమెంట్‌ కర్మాగారాలకు సరఫరా చేస్తున్నారు.

ఆరు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు

రోజువారీ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను డంపింగ్‌ యార్డుల్లో పోగుచేయకుండా అదే రోజు విద్యుత్‌గా మార్చే వ్యవస్థను నెలకొల్పుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురం కేంద్రాల్లో ఆరు కొత్త వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో పనిచేస్తున్న ప్లాంట్లతో పాటు ఈ కొత్త యూనిట్లు పూర్తయితే రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్‌గా మార్చే సామర్థ్యం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్లాంట్లు పూర్తయ్యే వరకు రోజువారీ ఘన వ్యర్థాల నిర్వహణకు ఫ్రెష్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. వీటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అక్టోబర్‌ 2 నుంచి మొత్తం చెత్తను ప్లాంట్లకే తరలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో, ప్రాసెసింగ్‌ ఆలస్యమైతే మళ్లీ డంప్‌సైట్లు ఏర్పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

డంప్‌సైట్‌ లేని మున్సిపాలిటీలే లక్ష్యం

చెత్తను కుప్పగా పోయడం కాకుండా, సేకరణ నుంచి ప్రాసెసింగ్‌, విద్యుత్‌ ఉత్పత్తి వరకు ఒకే గొలుసును ఏర్పాటు చేయడమే ప్రభుత్వ విధానమని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి మున్సిపాలిటీల్లో కొత్తగా చెత్త డంప్‌ చేయకుండా, ఉత్పత్తి అయిన రోజే ప్లాంట్లకు తరలించే విధానం అమల్లోకి రావాలని లక్ష్యం పెట్టుకున్నారు.

గత హయాంలో 10 వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు మంజూరైనా ఎనిమిది రద్దయ్యాయని, అందువల్లే చెత్త కుప్పలు పెరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆరు కొత్త ప్లాంట్లతో పాటు ఫ్రెష్‌ వేస్ట్‌ యూనిట్ల ద్వారా రాష్ట్రాన్ని డంపింగ్‌ యార్డ్‌ రహితంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 2 గడువు నాటికి భూమిలోపలి వ్యర్థాల తొలగింపు, చెత్త తరలింపు వ్యవస్థ ఎంతవరకు పూర్తవుతాయనేది మాత్రం పనుల వేగంపైనే ఆధారపడి ఉంటుంది.

Read More
Next Story