Sri City | టిల్ మృతుల కుటుంబాలకు కొండంత అండ
బాధితుల్లో ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల పరిహారం చెక్కుల పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలోని టాబ్లెట్స్ ఇండియో లిమిటెడ్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలుడులో మరణించిన ఐదుగురు కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా 24 గంటల్లో మంజూరు చేసింది.
శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ నెలమూడో తేదీ జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ఈ పరిహారం చెక్కులు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, నష్ట పరిహారం చెక్కులను అందించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, టిల్ హెల్త్ కేర్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ ఝావెర్, తదితరులు పాల్గొన్నారు.
"శ్రీసిటీలోని టిల్ లో జరిగిన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరం. ఘటన జరిగిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు" అని కలెెక్టర్ వెంకటేశ్వర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లో ప్రతి మృతుని కుటుంబానికి కంపెనీ తరఫున రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించినట్లు తెలిపారు. ప్రమాద బీమా పాలసీ కింద లభించే పరిహారాన్ని కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల అర్హతలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల విద్యకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు.
ఇదీ బాధితులకు పరిహారం..
శ్రీసిటీ టిల్ పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెక్కులు అందించారు. అందులో
"రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో కలిపి తన్నీరు వాసు కుటుంబానికి రూ.78,56,278, కె. చిన్నమస్తాన్ కుటుంబానికి రూ.72,72,234, గౌరబ్ రాయ్ కుటుంబానికి రూ.76,98,345, రమేష్ నటరాజ్ కుటుంబానికి రూ.61,50,178, మోహన్ రాజ్ కుటుంబానికి రూ.65,25,235 మేరకు పరిహారం అందనుంది" అని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాల పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
బాధిత కుటుంబాల సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అవసరమైన తదుపరి సహాయం లేదా సహకారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎప్పుడైనా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీసిటీతో పాటు జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
"పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల భద్రతా నిబంధనలు, చట్టబద్ధమైన నియమ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హామీ ఇచ్చారు.
Next Story

