గిరిజ‌న‌ విశ్వ‌విద్యాల‌యంపై ప్ర‌త్యేక బాధ్య‌త‌లున్నాయ్‌!
x
స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్న రాష్ట్ర‌ప‌తి ముర్ము, కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు

గిరిజ‌న‌ విశ్వ‌విద్యాల‌యంపై ప్ర‌త్యేక బాధ్య‌త‌లున్నాయ్‌!

సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీపై అనేక ప్ర‌త్యేక బాధ్య‌త‌లున్నాయ‌ని భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు.

విశాఖ‌ప‌ట్నంలోని కేంద్రియ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం తొలి స్నాత‌కోత్స‌వం మంగ‌ళ‌వారం విశాఖ‌లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ స్నాత‌కోత్స‌వానికి ముఖ్య అతిథిగా భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హాజ‌ర‌య్యారు. ఈ స్నాత‌కోత్స‌వ వేడుక‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, రాష్ట్ర మంత్రులు లోకేష్‌, సంధ్యారాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. తొలుత యూనివ‌ర్సిటీ ఛాన్సలర్ మదన్ లాల్ మీనా కాన్వోకేషన్ డిక్లేర్ చేయగా యూనివర్సిటీ చరిత్ర, సాధించిన విజయాలు, ఇతర కార్యకలాపాల గురించి వీసీ టి. శ్రీనివాసన్ చదివి వినిపించారు. ముఖ్య అతిథి ద్రౌపది ముర్మును, ఇతర అతిథులను సత్కరించారు. అనంతరం గోల్డ్ మెడల్స్ సాధించిన 13 మందికి రాష్ట్రపతి పతకాలు అందజేశారు. అలాగే 373 మంది ప‌ట్ట‌భ‌ద్రుల‌కు డిగ్రీ ప‌ట్టాల‌ను ప్ర‌దానం చేశారు. ఈ స్నాత‌కోత్సంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము ప్ర‌సంగించారు. ఆ ప్ర‌సంగం ఆమె మాట‌ల్లోనే..


విద్యార్థినికి ప‌ట్టాను ప్ర‌దానం చేస్తున్న రాష్ట్ర‌ప‌తి ముర్ము

గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఎంతో తీర్చిదిద్దుతుంది..
` విశాఖ‌ప‌ట్నంలోని కేంద్రియ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం గిరిజ‌న స‌మాజంలో ఆత్మ విశ్వాసం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, విధాన రూప‌క‌ల్ప‌న సామ‌ర్థ్యాల‌ను పెంపొందించే కేంద్రంగా మారుతుంద‌ని ఆశిస్తున్నాను. విద్యార్థులు త‌మ స‌మాజం, సంస్కృతి, సంప్ర‌దాయాల‌తో అనుబంధాన్ని కొన‌సాగిస్తూనే స‌మాజం, దేశ భ‌విష్య‌త్తును మెరుగు ప‌రిచే దిశ‌గా కృషి చేయాలి. ఈ విశ్వ‌విద్యాల‌యంపై అనేక ప్ర‌త్యేక బాధ్య‌త‌లున్నాయి. సామాజిక న్యాయం అనే ల‌క్ష్యంతో స్థాపించ‌బ‌డిన సంస్థ‌ల‌కు, త‌మ ప్రాంతంలోని గిరిజ‌న వ‌ర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవ‌నోపాధి, అట‌వీ హ‌క్కుల కోసం క్షేత్ర‌స్థాయిలో కృషి చేయాల్సిన బాధ్య‌త కూడా ఉంది. రాబోయే కాలంలో అట్ట‌డుగు, గిరిజ‌న వ‌ర్గాల యువ‌త స‌మ‌గ్ర వికాసం కోసం, ఆ ప్రాంత స‌ర్వ‌తోముఖాభ‌వృద్ధి కోసం ఈ విశ్వ‌విద్యాల‌యం అర్థ‌వంత‌మైన కృషి చేస్తుంది. గిరిజ‌నుల జీవ‌నోపాధిని మెరుగు ప‌ర‌చ‌డానికి, అట‌వీ ఉత్ప‌త్తులు, చేతి వృత్తులు, చిరుధాన్యాలు, ఔష‌ధ మొక్క‌లు, ప‌ర్యావ‌ర‌ణం, ప‌ర్యాట‌కం, స్థానిక వ్య‌వ‌స్థాప‌క‌త త‌దిత‌ర రంగాల్లో ఉత్పాద‌క ప‌నిని సుల‌భ‌త‌రం చేస్తూ అన్ని విశ్వ‌విద్యాల‌యాలు, ముఖ్యంగా గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యాలు వినూత్న వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయాలి.

స్నాత‌కోత్స‌వానికి హాజ‌రైన విద్యార్థినీ విద్యార్థులు

స్నాత‌కోత్స‌వం ఓ మైలురాయి..
ప్ర‌తి విద్యార్థి జీవితంలో స్నాత‌కోత్స‌వం ఒక ముఖ్య‌మైన మైలురాయి. ఇది వేడుక చేసుకునే రోజు మాత్ర‌మే కాదు.. త‌మ భ‌విష్య‌త్తు గురించి ఒక సంక‌ల్పం తీసుకోవ‌డానికి విద్యార్థుల‌ను ప్రేరేపించే క్ష‌ణం కూడా. వేగంగా మారుతున్న వాతావ‌ర‌ణంలో నిల‌దొక్కుకోవ‌డానికి, నైపుణ్యాభివృద్ధిలో ఆవిర్భ‌విస్తున్న అవ‌కాశాల‌పై దృష్టి సారించాలి. వారు పాఠ్య‌పుస్త‌కాల‌కే ప‌రిమితం కాకుండా ఆచ‌ర‌ణాత్మ‌క నైపుణ్యాల‌ను పెంపొందించుకోవ‌డానికి త‌మ చుట్టూ ఉన్న ప‌రిస‌రాల నుంచి కూడా నేర్చుకోవాలి. విద్యార్థులు త‌మ స‌మాజం, సంస్కృతి, సంప్ర‌దాయాల‌తో మ‌మేక‌మై ఉంటూనే, స‌మాజం, దేశ భ‌విష్య‌త్తును మెరుగు ప‌ర‌చ‌డానికి కృషి చేయాలి.
మాన‌సికంగా ఇప్ప‌ట్నుంచే సిద్ధంకండి..
ఇంటికి పునాది బ‌లంగా ఉండాలి. అలాగే విద్య‌లోనూ పునాది బ‌లంగా ఉంటే విద్యార్థులకు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు దోహ‌ద‌ప‌డుతుంది. విద్య మీతో పాటు స‌మాజానికి, దేశానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థులు స‌మాజ సేవ‌కు, దేశ నిర్మాణానికి ఇప్ప‌ట్నుంచే మాన‌సికంగా సిద్ధం కండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మ‌న దేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫ‌లాల‌ను స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు అందిస్తూనే మ‌న సాంస్కృతిక వార‌స‌త్వంతో అనుసంధాన‌మై ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఉత్త‌రాంధ్ర గిరిజ‌న వ‌ర్గాల‌ను సాధికారం చేసే ల‌క్ష్యంతో విశ్వ‌విద్యాల‌యం ఒక సైన్స్ అండ్ టెక్నాల‌జీ హ‌బ్‌ను నిర్వ‌హిస్తోంది. గిరిజ‌న సంక్షేమం, ప్ర‌జారోగ్యం, వాతావ‌ర‌ణ మార్పులు, ఆహార‌, పోష‌కాహార భ‌ద్ర‌త‌, ఇంధ‌న పొదుపు వంటి అంశాల్లో విద్యాప‌ర‌మైన క్షేత్ర‌స్థాయి కార్య‌క‌లాపాల‌పై విశ్వ‌విద్యాల‌యం ప్ర‌త్యేక దృష్టి సారించింది.` అని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.
Read More
Next Story