x
వాంగ్ చుక్ దీక్ష విరమణ (ఫైల్)

సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ- తొలిసారి నోరు విప్పిన ప్రధాని

రంగంలోకి దిగిన ప్రధాని, నేటి నుంచి చర్చలు సాగుతాయని అంచనా


దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులపై కఠిన చర్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. అయితే, దీక్ష ముగిసినంత మాత్రాన ఉద్యమం ఆగదని, విద్యార్థుల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దీక్ష విరమింపజేస్తున్న కేంద్ర మంత్రి నడ్డా తదితరులు

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సుదీర్ఘ చర్చల అనంతరం, దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దీక్షను విరమిస్తున్నట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, వాటి అమలును గమనిస్తామని ఆయన పేర్కొన్నారు.

రంగంలోకి దిగిన ప్రధాని..
నీట్‌ ప్రశ్న పత్రం లీక్‌పై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం అవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఉదయం, రాత్రి రెండుసార్లూ... ప్రధాని ఈ సమస్యపై స్పందించారు. లీకులపై కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. పీఎం ఉదయం ప్రకటన తర్వాత సాయంత్రంకల్లా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అమలు చేసింది. పరీక్ష పత్రాల లీక్‌లపై క్రిమినల్‌ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ దిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అను గ్రోవర్‌ బలిగను ఈ కోర్టుకు న్యాయాధికారిగా నియమించింది. ఈ కోర్టు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పని చేయనుంది.

పరీక్షా పేపర్ లీకుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని, నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

"యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. వారి భవిష్యత్తును దెబ్బతీయాలనుకునే వారిని విడిచిపెట్టం. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం" అని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.

ప్రధాని ప్రకటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. చర్చలకు రావాలని సీజేపీ (Cockroach Janata Party) నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

"ఇది చాలదు".. సీజేపీ తొలి స్పందన

అయితే ప్రధాని హామీలను సీజేపీ తొలుత తిరస్కరించింది. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు జంతర్ మంతర్‌ను వీడేది లేదు" అని స్పష్టం చేసింది. "Dharmendra Pradhan Must Resign" అనే పోస్టును కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.

ఆగని పోరాటం...
అయితే జంతర్ మంతర్ కేంద్రంగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం మాత్రం ఆగలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా, పరీక్షా వ్యవస్థలో సమూల సంస్కరణలు, పేపర్ లీకులపై కఠిన చట్టాలు వంటి డిమాండ్లపై నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడా పెరుగుతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు స్విగ్గీ, జొమాటో ద్వారా దేశం నలుమూలల నుంచి ఆహారం, తాగునీరు చేరుతోంది. "Love from Kerala" వంటి సందేశాలతో కేరళ, ముంబై సహా పలు రాష్ట్రాల నుంచి ఆహార ఆర్డర్లు వస్తున్నాయి. "ఆకలితో ఉన్న ఏ నిరసనకారుడికైనా ఇవ్వండి" అనే సూచనలతో పంపుతున్న ఈ ఆహారాన్ని వాలంటీర్లు నిరసనకారులకు పంపిణీ చేస్తున్నారు.
అంతేకాదు, సచ్‌కండ్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు రోజుకు వేలాది మందికి ఆహారం, నీరు, అవసరమైన వస్తువులు అందిస్తుండగా, పలు విద్యార్థి సంఘాలు కూడా సరఫరాను సమన్వయం చేస్తున్నాయి. ఈ భారీ సహాయ వ్యవస్థ ఎలా నడుస్తోంది? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే అంశాలపై భద్రతా, నిఘా సంస్థలు సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సహాయం చట్టవిరుద్ధమని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి, విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు చట్టపరమైన, పరిపాలనా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నాయి.
(వివిధ వార్తా పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా రాసిన వార్త ఇది)
Read More
Next Story