సోషల్ మీడియా స్నేహం..లాడ్జిలో పార్టీ..యువతి ఆత్మహత్య
x

సోషల్ మీడియా స్నేహం..లాడ్జిలో పార్టీ..యువతి ఆత్మహత్య

ఆరుగురు స్నేహితులను నిందితులుగా పేర్కొంటూ, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


సోషల్ మీడియా పరిచయాలు.. క్షణికావేశంలో చేసుకున్న పార్టీలు ప్రాణాల మీదకు తెస్తాయని చెప్పడానికి విశాఖపట్నంలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని వెళ్లిన ఒక యువతి, చివరకు విగతజీవిగా త్రిగిరావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి భౌతిక దాడికి దారితీయడం.. నమ్మిన స్నేహితులే అందరి ముందు తనపై చేయి చేసుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆ యువతి, ఆ మనస్తాపంతో లాడ్జి గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. సరదాగా సాగాల్సిన స్నేహ బంధం కాస్తా.. చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొని స్మశాన నిశ్శబ్దాన్ని మిగిల్చింది.

సోషల్ మీడియా స్నేహం.. లాడ్జిలో పార్టీ

జోడుగుళ్లపాలేనికి చెందిన ఆకుమర్తి శాంతి (27)కి నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన సాయికిరణ్‌, సంజన, జస్వంత్‌, సాయికుమార్‌, మణి అనే ఆరుగురు వ్యక్తులతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అందరూ కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం జోడుగుళ్లపాలెం బీచ్‌ రోడ్డులోని ఒక లాడ్జిలో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు.
మద్యం మత్తులో వివాదం.. దాడి
అక్కడ అందరూ కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలో వారి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి ఘర్షణ మొదలైంది. ఈ వివాదం ముదిరి పుచ్చ సాయికిరణ్‌, లక్ష్మీ సౌజన్య, జస్వంత్‌ కలిసి శాంతిపై చేయి చేసుకున్నారు. తన స్నేహితులే తనను అందరి ముందు కొట్టడాన్ని శాంతి తీవ్ర అవమానంగా భావించింది.
అవమానం భరించలేక..
స్నేహితులంతా పక్క గదిలోకి వెళ్లిపోగా, శాంతి ఒంటరిగా తన గదిలో ఉండిపోయింది. మనస్తాపానికి గురైన ఆమె, లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కాసేపటికి స్నేహితులు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో, తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆరుగురిపై కేసు నమోదు
ఈ ఘటనపై మృతురాలి తల్లి ఆకుమర్తి రమ్య ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు స్నేహితులను నిందితులుగా పేర్కొంటూ, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read More
Next Story