ఆకాశ మార్గం.. విజయవాడ నుంచి అమరావతి ఆలయం వరకు రోప్‌వే
విజయవాడ, అమరావతి అందాలు తిలకించేందుకు ప్రభుత్వం రోప్ వే ఏర్పాటుకు నిర్ణయించింది.
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమరావతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు రోప్‌వే నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 64వ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను అనుమోదించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కనకదుర్గ ఆలయం పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్ మీదుగా అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు రోప్‌వే నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో అమలు చేయనున్నారు.
కృష్ణానదిపై రోప్ వే ద్వారా ప్రయాణిస్తున్నట్లుగా ఏఐ సృష్టించిన చిత్రం.
ప్రతిపాదిత రోప్‌వే పొడవు సుమారు 3.3 కిలోమీటర్లు కాగా అంచనా వ్యయం రూ 750 కోట్లు. గత మార్చి నెలలోనే అమరావతి డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్‌డీఏ ఇప్పుడు అధికారిక ఆమోదం తెలపడంతో తదుపరి ప్రక్రియ వేగవంతం కానుంది. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుంచి ప్రధాన పుణ్యక్షేత్రాలు పర్యాటక కేంద్రాలకు నేరుగా అనుసంధానం ఏర్పడటం ద్వారా ప్రయాణ సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కనకదుర్గ ఆలయానికి చేరుకోవడానికి ప్రస్తుతం బస్సులు ఆటోలు టాక్సీలపై ఆధారపడాల్సి వస్తోంది. కొండ ఎక్కాల్సిన పరిస్థితి వృద్ధులు పిల్లలు వికలాంగులకు ఇబ్బందికరంగా ఉంది. రోప్‌వే ఏర్పాటు అయితే వారికి సులభమైన ప్రయాణం సాధ్యమవుతుంది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నగర దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తూ ప్రయాణించే అవకాశం భక్తులు పర్యాటకులకు లభిస్తుంది. భవానీ ఐలాండ్‌కు ప్రస్తుతం పడవల ద్వారానే చేరాల్సి వస్తున్న నేపథ్యంలో రోప్‌వే ద్వారా సులభ ప్రవేశం కల్పించి పర్యాటక సర్క్యూట్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల భక్తుల సంఖ్య పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక కార్యకలాపాలు కూడా ఉత్తేజం పొందుతాయని అంచనా.

