
పవన్‌తో పెట్టుకున్న పిఠాపురం 'వర్మ'పై వేటు
చంద్రబాబు సంచలన నిర్ణయం, పవన్ తోనే టీడీపీ బంధమని తేల్చి చెప్పిన చంద్రబాబు
పిఠాపురం రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. కూటమి ధర్మాన్ని మీరినా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్ల అసహనం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పదవి నుంచి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను తప్పించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గమైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా జనసేన నేతలతో, ముఖ్యంగా పవన్ కల్యాణ్ వర్గీయులతో నిత్యం ఘర్షణ పడుతున్న టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. ఆయన్ని ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల కోసం ముగ్గురితో ప్రత్యేక కమిటీని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఘర్షణకు దారితీసిన 'ఫ్లెక్సీ వార్'
ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం వర్మ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ, ఫలితాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తాజా వివాదానికి 'ఫ్లెక్సీ'లు కారణమయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జనసేన కార్యకర్తలతో వాగ్వాదానికి, పరస్పర దాడుల ప్రయత్నాలకు దారితీసింది. "అధినేత మాట కోసం మౌనంగా ఉన్నాం.. ఇకపై పరిస్థితి వేరేలా ఉంటుంది" అంటూ వర్మ చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.
పవన్ ఫిర్యాదు.. బాబు సీరియస్!
ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయిన సమయంలో పిఠాపురం పరిణామాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ తీరు వల్ల క్షేత్రస్థాయిలో కూటమి కార్యకర్తల మధ్య సమన్వయం దెబ్బతింటోందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించే ఎవరినీ ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న బాబు, వెంటనే వర్మను బాధ్యతల నుంచి తొలగించారు.
వర్మ భావోద్వేగం.. అనుచరుల ఆవేదన
పార్టీ నిర్ణయం వెలువడిన తర్వాత వర్మ పిఠాపురం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. "పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాను" అని పలవరిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, వర్మ అనుచరులు మాత్రం ఈ నిర్ణయంపై రగిలిపోతున్నారు. "సీటు త్యాగం చేసి, పవన్‌ను గెలిపించిన వ్యక్తికి ఇచ్చే బహుమతి ఇదేనా?" అంటూ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్‌కే పెద్దపీట!
ఈ వేటు ద్వారా చంద్రబాబు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. కూటమిలో పవన్ కల్యాణ్‌కు ఇచ్చే గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సొంత పార్టీ నేత అయినా సరే, పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని ఈ చర్య ద్వారా హెచ్చరించారు. పిఠాపురంలో వర్మ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఆయన కమిటీతో కలిసి పనిచేస్తారా లేక అసంతృప్త నేతగా మిగిలిపోతారా అన్నది వేచి చూడాలి.
Next Story

