
పిపిపి మోడల్ లో గొర్రెలు, మేక మాంసం విక్రయాలు
ఏపీలో గొర్రెలు, మేక మాంసం విక్రయాల్లో పెద్ద కంపెనీలు అడుగు పెట్టబోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
గొర్రె, మేక మాంసం రంగంలో ప్రభుత్వం నేరుగా ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. “AP Farm to Fork Products Pvt Ltd” పేరుతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్‌లో కొత్త కంపెనీని ఏర్పాటు చేసి, మాంసం సేకరణ, ప్రాసెసింగ్, స్థానిక విక్రయాలు, విదేశీ ఎగుమతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రైతులకు మంచి ధరలు, నాణ్యమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తుందని అధికారులు చెబుతున్నా, ప్రైవేట్ వ్యాపారులు, చిన్న మాంసం విక్రేతలు, మార్కెట్ నియంత్రణపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆధునిక మాంసపు ప్రాసెసింగ్ యూనిట్లు, హైజీనిక్ మీట్ షాపులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు లీజు కు ఇచ్చి, విక్రయాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఎలా అమలవుతుంది? ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రజలకు లాభమా లేదా కార్పొరేట్ లకు లాభమా?
ప్రభుత్వం రూపొందించిన ఈ మోడల్ ప్రకారం, కంపెనీలో ప్రభుత్వం మెజారిటీ వాటా కలిగి ఉండి, ప్రైవేట్ భాగస్వాములు టెక్నాలజీ, మార్కెటింగ్, ఎగుమతి నైపుణ్యం అందించాలి. రైతుల నుంచి నేరుగా మాంసం సేకరణ (డైరెక్ట్ ప్రొక్యూర్‌మెంట్), ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి స్థానిక మార్కెట్‌తో పాటు మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేయాలని లక్ష్యం. ఇది రైతులకు మధ్యవర్తులను తొలగించి మంచి ధరలు అందించే అవకాశం ఉందని ప్రభుత్వం వాదిస్తోంది.
పీపీపీ మోడల్ ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం రాష్ట్రంలో మాంసం విక్రయాలు చాలా వరకు అనధికారికంగా, సాంప్రదాయిక బూత్‌ల ద్వారా జరుగుతున్నాయి. హైజీన్ లోపాలు, వ్యర్థాల నిర్వహణ సమస్యలు, అక్రమ వధలు సాధారణ సమస్యలు. పీపీపీలో ప్రభుత్వం భూమి లేదా మౌలిక సదుపాయాలు అందించి, ప్రైవేట్ సంస్థలు ఆధునిక స్లాటర్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్ యూనిట్లు నిర్మించి నడపాలి. లీజ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (LOT) మోడల్‌లో ప్రైవేట్ భాగస్వామి మాంసం సేకరణ, ప్రాసెసింగ్, విక్రయాలు చేసి, ప్రభుత్వానికి రెవెన్యూ షేర్ చెల్లించాలి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29లోనూ మోడర్న్ ప్రాసెసింగ్ యూనిట్లు, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లకు 35-50 శాతం సబ్సిడీలు, పీపీపీ ప్రోత్సాహం ఇవ్వడం ఇందుకు ఆధారం.
ప్రభుత్వం ఎందుకు ఈ ఆలోచన?
అనధికారిక మాంసం విక్రయాల వల్ల ఆరోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఆధునిక సదుపాయాలు తీసుకొచ్చి హైజీన్, ఫుడ్ సేఫ్టీ, ఎగుమతి అవకాశాలు పెంచాలి. అంతేకాకుండా, మేక-గొర్రె పెంపకందారులకు మంచి ధరలు, రైతులకు అదనపు ఆదాయం లక్ష్యాలు. ఏపీ మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా గతంలో ప్రాసెసింగ్ కోసం పీపీపీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EoI) జారీ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం PPPని ‘డెవలప్‌మెంట్ మ్యాజిక్’గా చూస్తోంది. ఇండస్ట్రియల్ పార్కులు, హెల్త్ సెక్టర్ తర్వాత మీట్ సెక్టర్‌కు కూడా విస్తరించాలని ఆలోచన.
లాభాలు ఎవరికి?
ఒకవైపు హైజీన్, నాణ్యత మెరుగుపడవచ్చు. ప్రైవేట్ సంస్థల నైపుణ్యం, టెక్నాలజీతో మాంసం ఎగుమతులు పెరగవచ్చు. మరోవైపు సవాళ్లు ఎక్కువ. చిన్న చిన్న బూత్ యజమానులు, స్థానిక వ్యాపారులు ఎలా ఉన్నారు? ప్రైవేట్ సంస్థలు ఏకస్వామ్యం సృష్టించి ధరలు పెంచే అవకాశం ఉంది. మాంసం ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని పెరిగితే సాధారణ ప్రజలు, మత్స్యకారులు, లాండ్‌లెస్ లేబర్ ఎలా భరించాలి? మత సంవేదనలు (ముఖ్యంగా బీఫ్ విక్రయాలు) కూడా ఉన్నాయి. గతంలో ప్రాసెసింగ్ యూనిట్లలో పీపీపీలో పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ వైఫల్యాలు కనిపించాయి.
ప్రైవేట్ వ్యాపారులపై ప్రభావం
ప్రస్తుతం రాష్ట్రంలో గొర్రె-మేక మాంసం విక్రయాలు చాలా వరకు చిన్న చిన్న ప్రైవేట్ వ్యాపారులు, స్థానిక బూత్ యజమానుల ద్వారా జరుగుతున్నాయి. వీరు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్త కంపెనీ వచ్చిన తర్వాత ఈ చిన్న వ్యాపారులు ఎలా ఉన్నారన్న ప్రశ్న తీవ్రంగా ఉంది. “ప్రభుత్వం ఏకపక్షంగా పెద్ద కంపెనీని తీసుకొచ్చి మార్కెట్‌ను ఏకస్వామ్యం చేస్తే, లక్షల మంది చిన్న వ్యాపారులు ఉద్యోగాలు కోల్పోతారు. ఇది రైతులకు మాత్రమే కాదు, వినియోగదారులకు కూడా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది” అని ఏపీ మీట్ ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం “ప్రజా సౌకర్యం” అని చెప్పినా, ఇది మరో ప్రైవేటీకరణ దశ కాదా అన్న సందేహాలు తీవ్రంగా ఉన్నాయి. ఏపీలో PPP మోడల్ రోడ్లు, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్ పార్కుల్లో మిక్స్ రికార్డు ఉంది. కొన్ని చోట్ల వేగం వచ్చింది, కానీ రెవెన్యూ లీకేజీ, ప్రజల భారం పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాంసం రంగం అనధికారికంగా ఉన్నా, లక్షలాది మందికి ఉపాధి ఇస్తోంది. దీన్ని పూర్తిగా ప్రైవేటు చేతులకు అప్పగించడం సరైనదా?
మార్కెట్ నియంత్రణ ఎవరి చేతుల్లో?
ప్రభుత్వం మెజారిటీ వాటాతో కంపెనీని నడిపితే, చివరికి మార్కెట్ నియంత్రణ ప్రభుత్వ-ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. రైతుల నుంచి నేరుగా సేకరణ ద్వారా మధ్యవర్తులను తొలగించాలన్న లక్ష్యం సాధ్యమవుతుందా లేదా కేవలం కొత్త రకం మధ్యవర్తులు (కంపెనీ ఏజెంట్లు) వస్తారా అన్నది కీలకం. గతంలో విజయ డైరీ మోడల్‌లో కొన్ని సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, ఈ కొత్త కంపెనీ నిర్మాణం, షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్, ధర నిర్ణయ విధానం, రైతులకు గ్యారంటీడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ (MSP) లాంటి వివరాలు స్పష్టంగా ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వం నిజంగా ప్రజల ఆరోగ్యం, రైతుల ఆదాయం కోసం ఆలోచిస్తే పీపీపీకి ముందు స్థానిక వ్యాపారులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, హైజీన్ స్టాండర్డ్స్ అమలు చేయాలి. కేవలం ప్రైవేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టే మోడల్ కాకుండా, ప్రజా ప్రయోజనాలు రక్షించే మోడల్‌ను రూపొందించాలి. లేకపోతే ఈ ‘మోడర్న్ మీట్ సేల్స్’ కూడా మరో ‘ప్రకటనా పథకం’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు, వ్యాపారులు, పశుపోషకులు ఈ ఆలోచనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన సమయం ఇది.
ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా రైతుల ఆదాయం పెంచడం, ఎగుమతులు పెంచడం, ఆధునికీకరణ చేయడం అన్న లక్ష్యాలు సాధించాలంటే పారదర్శకత, రైతుల సహకారం, చిన్న వ్యాపారులకు రక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే “ఫార్మ్ టు ఫార్క్” అన్న పేరు కేవలం ప్రకటనగా మిగిలిపోయి, మార్కెట్ ఏకస్వామ్యం, రైతుల మరో రకం దోపిడీకి దారి తీసే ప్రమాదం ఉంది.
ఈ కొత్త కంపెనీ ఏర్పాటు విషయంలో రైతు సంఘాలు, వ్యాపార సంఘాలు, నిపుణులతో సమగ్ర చర్చలు జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్‌లను ఎలా స్వీకరిస్తుందన్నది ఇక్కడి నుంచి ముఖ్యం.

