
డీలిమిటేషన్ లింక్ తో సంబంధం తీసేయండి?
మహిళా రిజర్వేషన్ పై రాహుల్ గాంధీ ప్రశ్నలు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన విజ్ఞప్తిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ను లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్‌తో కేంద్రం ఎందుకు ముడిపెడుతోందని ఆయన ప్రశ్నించారు. 2023లోనే పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్‌తో సంబంధం ఎందుకు?
మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్‌ను అనవసరంగా ముడిపెట్టాల్సిన అవసరం ఏముందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 2023లో కాంగ్రెస్ పూర్తి మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఆయన గుర్తుచేశారు.
మూడేళ్లు గడిచినా ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన రాహుల్.. ఇప్పుడు దాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీశారు. 2023లో ఆమోదమైన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు రిజిజు విజ్ఞప్తి
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మహిళల భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. మహిళలకు భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే దేశం అసంపూర్ణంగా, బలహీనంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను రిజిజు కాంగ్రెస్ నుంచి వచ్చిన సానుకూల సంకేతంగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీలో మార్పు కనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మహిళా రిజర్వేషన్‌పై ప్రతిపక్షాల వైఖరి
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టానికి మాత్రం అవి మద్దతు ప్రకటించాయి.
డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్‌ను స్వతంత్రంగా అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు.
రాజ్యాంగపరమైన అడ్డంకి
2023లో తీసుకొచ్చిన నారీ శక్తి వందన అధినియమ్‌కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అయితే మహిళా రిజర్వేషన్ అమలుకు అవసరమైన తదుపరి రాజ్యాంగ సవరణ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాతే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అయితే ఏప్రిల్ 17న లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు.
దీంతో మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా ముందుగా అమలు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

