
హిజ్రా ఆనందీ హత్య కేసులో సంచలన తీర్పు
ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష
కోనసీమ జిల్లా జొన్నాడ వద్ద మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న హిజ్రా హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులకు రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్. ఉమా సునంద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ శిక్షతో పాటు నిందితులకు ఒక్కొక్కరికి రూ. 15,000 జరిమానా కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
దారుణ హత్య.. కాలువలో లభ్యమైన మృతదేహం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంకు చెందిన మరుమట్ల ఆనంద్ అలియాస్ ఆనందీ అనే హిజ్రా ధవళేశ్వరంలో నివాసం ఉండేవారు. అయితే, 2023 మే 12వ తేదీ రాత్రి జొన్నాడ 216ఏ జాతీయ రహదారి పక్కన ఉన్న పంట కాలువలో ఆనందీ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. సహచర హిజ్రా ధనాల మందాకిని ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
నేరం రుజువైన నిందితులు వీరే..
పోలీసుల దర్యాప్తులో ధవళేశ్వరానికి చెందిన కేత వెంకట భరత్ సుధీర్ (పెద్ద), బొమ్మూరుకు చెందిన వేలు కళ్యాణ్ (పెద కాళీ), ధవళేశ్వరానికే చెందిన సింగంపల్లి కార్తీకేయ (సింబ) ఈ హత్యకు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో రుజువైంది. దీంతో న్యాయస్థానం వీరికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. బాధితుల తరఫున పీపీలు కె. రాధాకృష్ణ రాజు, డి. వాణిభాయిలు బలమైన వాదనలు వినిపించారు.
పోలీసు యంత్రాంగానికి ప్రశంసల జల్లు
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అప్పటి దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సీఐ ఎన్. రజనీకుమార్, డీఎస్పీ కె.వి. రమణల కృషిని కొనియాడారు. అలాగే ప్రస్తుతం నిందితులకు శిక్ష పడే వరకు పకడ్బందీగా వ్యవహరించిన డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐ విద్యాసాగర్, ఎస్సై నరేష్‌లను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవీ అశోక్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అభినందించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

