వేటకొడవళ్ల స్వైర విహారం.. జర్నలిస్టు దారుణహత్య
x

వేటకొడవళ్ల స్వైర విహారం.. జర్నలిస్టు దారుణహత్య

చిత్తూరు జిల్లా వి.కోట వద్ద ఘటన


అటవీ స్మగ్లర్ల వేటకొడవళ్లు స్వ్వైర విహారంతో ఓ సీనియర్ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో చిత్తూరు జిల్లా ఉలిక్కిపడింది. జిల్లాలో గతంలో ఇలాంటి దారణ సంఘటన జరిగిన దాఖలాలు లేవు.

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి. కోట మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. స్థానికంగా పనిచేసే ఏబీన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డి ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో వేటకొడవళ్లతో విరుచుకుపడిన కొందరు వెంటాడి వేటాడినట్లు సమాచారం అందింది. స్థానిక స్మగ్లర్లే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు సందేహిస్తున్నారు.

పలమనేరుకు సమీపంలోని వి. కోట మండల విలేఖరిగా జగన్ మోహన్ రెడ్డి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లిన సమయంలో కొందరు వేటకొడవళ్లతో వెంటపడ్డారని, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు దీస్తున్న జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డిని వెంటాడి, వేటాడి చంపారని పోలీసులు గుర్తించారని సమాచారం.
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాలు కర్ణాటక రాష్ట్రానికి, అటు తమిళనాడుకు సరిహద్దుల్లో ఉంటాయి. విస్తారంగా ఉన్నఈ ప్రాంతంలోని అడవుల్లో శ్రీగంధం వనాలకు కొదవలేదు. జిల్లా నుంచి ఎర్రచందనం, పడమటి ప్రాంతాలైన కుప్పం. పలమనేరు ప్రాంతాల నుంచి అక్రమ రవాణ చేస్తున్న శ్రీగంధంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రత్యేక కథనాలు రాశారని చెబుతున్నారు.

స్మగ్లర్ కన్నెర్ర..

శ్రీగంథం అక్రమ రవాణాపై కథనాలు రాయడం స్థానికంగా ఉంటున్న ఓ స్మగ్లింగ్ కన్నెర్ర చేశారని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో జరిగిన ఓ సంఘటనలో తనను అరెస్టు చేయించారని ఆగ్రహంతో ఉన్న ఓ స్మగ్లర్ జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డిని అంతం చేయడానికి సాహసించాడని భావిస్తున్నారు.
వి.కోటలో మంగళవారం ఉదయం వాకింగ్ కు బయలుదేరిన జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డిని వెంటాడి, కత్తులతో నరికి చంపినట్లు తెలిసింది. వీధిలోనే జరిగిన ఈ సంఘటనతో అప్పటికే నిద్ర లేచి బయటకు వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య సమాచారం తెలిసిన వెంటనే వి. కోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, ఈ దురాగతానికి పాల్పడిన నిందితుల కోసం వేట ప్రారంభించారు.

జర్నలిస్టుల నిరసన

వి.కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డి హత్యకు గురయ్యారనే సమాచారం జిల్లా మొత్తం పాకింది. ఈ సంఘటనపై వివిధ జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు తోపాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, సంఘాల నేతలు వి.కోటకకు చేరుకుంటున్నారని సమాాచారం.


Read More
Next Story