
తాంత్రిక పూజల పేరుతో ఘోరం!”.. ఇంతకు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన ..పోలీసుల అదుపులో నిందితుడు..
తాంత్రిక పూజల పేరుతో ఇంట్లో ఉన్న “దుష్టశక్తులను” తరిమికొడతానని నమ్మించి, 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది.
ఇంతకు ఏం జరిగిందంటే..
బాధిత బాలిక తన తల్లితో కలిసి కళ్యాణ్ పట్టణంలో నివసిస్తోంది. కొన్ని నెలల క్రితం బాలిక తండ్రి, అమ్మమ్మ మరణించడంతో కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబసభ్యులు అంబర్‌నాథ్ ప్రాంతానికి చెందిన షాహిద్ మహమ్మద్ వాహిద్ షేక్ (78)ను ఆశ్రయించారు. అప్పటికే వాహిద్ షేక్ స్వయం ప్రకటిత దేవుడిగా చలామణి అవుతున్నాడు. తల్లి, కూతురి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వాహిద్ షేక్.. మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయంటూ వారిని నమ్మించాడు. తాంత్రిక పూజలు చేస్తే మీకు ఏ సమస్యలు ఉండవని చెప్పి వారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వాహిద్, బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక ఫిర్యాదు మేరకు వాహిద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం, అలాగే మహారాష్ట్ర క్షుద్రపూజల నిరోధక చట్టం కింద నిందితుడిపై పలు సెక్షన్లు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మార్చిలో నాసిక్‌లో కూడా ఒక స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అత్యాచార కేసులో అరెస్టయ్యాడు.
“కెప్టెన్” అని చెప్పుకునే అశోక్‌కుమార్ ఖరత్ అనే వ్యక్తి, రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నట్లు చెప్పుకుని మహిళలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 35 ఏళ్ల మహిళపై మూడు సంవత్సరాలకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఆ మహిళ భర్త ప్రాణానికి ప్రమాదం ఉందని భయపెట్టి, జ్యోతిష్య సలహాల పేరుతో తన కార్యాలయానికి పిలిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నేరానికి ముందు మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఖరత్ వద్ద నుంచి 58 అభ్యంతరకర వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది.
తాంత్రిక పూజలు, జ్యోతిష్యం, దైవశక్తుల పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

