ఖాకీ యూనిఫాంలో నీచాతి నీచం
x
ఏఐ సృష్టించిన హనీ ట్రాప్ పోలీస్ చిత్రం

ఖాకీ యూనిఫాంలో నీచాతి నీచం

పోలీసు వ్యవస్థపై బ్లాక్ మెయిల్ మచ్చ పడింది. అనంతపురం హనీట్రాప్ కేసులో పోలీసులే సూత్ర దారులు కావడం విశేషం.


అనంతపురం జిల్లా పోలీసు వ్యవస్థకు ఇది కేవలం ఒక కేసు కాదు. ఒక దారుణమైన వ్యవస్థాగత వైఫల్యం. నైతిక పతనం. రక్షకులుగా ఉండాల్సిన సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు తామే బ్లాక్‌మెయిల్ దందాకు సహాయపడి, యువకులు, ఉద్యోగులు, అధికారులను హనీట్రాప్‌లో పడేసి కోట్లు సంపాదించారన్న వార్త రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కలచివేసింది. ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకున్నా, ఈ సంఘటన పోలీసు శాఖలోని కొందరి నీచ స్వభావాన్ని స్పష్టంగా బయటపెట్టింది.

ఒక సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు డిస్మిస్

విచారణలో బయటపడిన వివరాలు షాకిస్తాయి. రాప్తాడు సీఐ శ్రీహర్ష వర్ధన్‌ను ఉద్యోగం నుంచి డిస్‌మిస్ చేయడం, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుళ్లు గిరి, దుర్గా ప్రసాద్, ఇటుకలపల్లి స్టేషన్‌లోని కానిస్టేబుల్ దేవలా నాయక్‌ను తొలగించడం. కేవలం ప్రారంభం మాత్రమే. ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరామ్ నాయక్‌లను సస్పెండ్ చేయడం, రూరల్ సీఐ రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపడం, ఇలా మొత్తం ఎనిమిది మంది పోలీసు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. కీలక సూత్రధారి రంగమ్మ (అలియాస్ చిన్ని మళ్లేశ్వరి, ఉమాదేవి)తో ఈ అధికారులు సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, ఆమె గ్యాంగ్‌కు అండగా నిలిచారు. యువకులు, ఉద్యోగులను మహిళల వలలో పడేసి, వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు, కోట్లు వసూలు చేశారు. వీరి ఖాతాల్లోకి లక్షలు జమ అయినట్లు బ్యాంక్ లావాదేవీలు నిరూపించాయి.

మహిళను అడ్డం పెట్టుకుని లూఠీ చేశారు...

ఇక్కడే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏపీ పోలీసుల్లోని కొందరు సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఇంత నీచానికి పాల్పడతారా? ప్రజల భద్రత, గౌరవాన్ని కాపాడాల్సిన వారే తమ యూనిఫాంను దుర్వినియోగం చేసి, సమాజాన్ని లూటీ చేయడం ఎంతటి దారుణం! బాధితులు కేసు పెట్టినా పట్టించుకోకుండా, గ్యాంగ్‌కు అండగా నిలవడం ద్వారా పోలీసు వ్యవస్థ మూలస్తంభాలే కుప్పకూలినట్లు అయింది. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుని మాట్లాడకుండా ఉండిపోయే స్థాయిలో ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికం కాదు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇటువంటి ఘటనలు జరగడం పోలీసు శాఖలోని కొందరి మనస్తత్వాన్ని ప్రశ్నించేలా చేస్తోంది.

వీళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు?

డిస్మిస్ అయిన వారు, సస్పెన్షన్ అయిన వారు, విఆర్ కు వెళ్లిన వారందరూ ఈ కేసులో బాధ్యులు. పోలీసు యూనిఫారం అడ్డం పెట్టుకుని ట్రాప్ చేసి ప్రజల నుంచి డబ్బు గుంజిన వీరిపై కేసు నమోదు చేయడమే కాకుండా అందరినీ అరెస్ట్ చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు. ఇంత మంది పోలీసులు ఒక మహిళ ను అడ్డం పెట్టుకుని, అలాగే పోలీస్ యూనిఫాం ను అడ్డం పెట్టుకుని ఈ విధమైన దోపిడీకి తెరతీయడం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ. వారిపై చర్యలు తీసుకున్నామని వదిలేస్తే మరో రూపంలో ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమానికి వీరు శ్రీకారం చుడతారనేది ప్రజలు అంటున్న మాట. అందుకే వీరిపై కేసులే కాకుండా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాల్సిన అవసరం ఉంది.

చట్టం ద్వారా శిక్ష పడాల్సిందే...

ప్రభుత్వం చేసిన చర్యలు డిస్‌మిస్‌లు, సస్పెన్షన్లు సరైనవే. కానీ ఇవి కేవలం మచ్చ మాత్రం తొలగించడం మాత్రమే. పోలీసు వ్యవస్థలోని నీచాతి నీచమైన తీరు బయటపడింది. రక్షక దళం అని పిలిచే ఈ సంస్థలో కొందరు దోపిడీ దారులుగా మారడం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసింది. ఇక్కడి నుంచి పాఠం నేర్చుకోవాలి. పోలీసు నియామకాల్లో నైతికత, నిజాయితీ పరీక్షలు బలోపేతం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, శాశ్వత నిషేధం విధించాలి. లేకపోతే ఖాకీ యూనిఫాంపైనే ప్రజలు అపనమ్మకం పెంచుకుంటారు.

ఈ కేసు ఒక్కటే కాదు ఇది పోలీసు వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిన హెచ్చరిక. ప్రజలు భయపడి, నమ్మకం కోల్పోయి ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అనంతపురం హనీట్రాప్ కేసు పోలీసు శాఖకు ఒక బ్లాక్ స్పాట్. ఇప్పటికైనా ఉన్నత స్థాయి విచారణ, సంస్కరణలు జరిగి, ఖాకీలోని నీచం పూర్తిగా తుడిచివేయబడాలి. లేకపోతే ఈ మచ్చ శాశ్వతంగా మిగిలిపోతుంది.

Read More
Next Story