కొన్నాళ్లుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభ తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు స్కూట్ ఎయిర్‌లైన్స్ తెరదించింది. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకంటే ఎక్కడో ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కే స్పష్టత వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి తమ విమాన సర్వీసులు జులై 8వ తేదీ నుంచి మొదలవుతాయని సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సంస్థ చేసిన ప్రకటన సంబంధిత అధికారులు, భారత విమానయాన సంస్థల ప్రతినిధులనే ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఎయిర్‌పోర్టు టెర్మినల్
రెండు ముహూర్తాలతో ప్రధానికి ఆహ్వానం..
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదివరకే నిర్ణయించారు. ఈ విమానాశ్రయం పనులు దాదాపు పూర్తి కావచ్చిన తరుణంలో గత నెలలో చంద్రబాబు రెండు ముహూర్తాలు నిర్ణయించారు. జులై 5, 8 , 10 తేదీలు లేదా ఆగస్టు 17, 18 తేదీల్లో ఏది అనువైతే ఆరోజు గాని ప్రారంభించాలని కోరుతూ ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇంకా దానిపై ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇంతలో శుక్రవారం సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సంస్థ జులై 8వ తేదీ నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి తమ సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీనిని బట్టి జులై 5వ తేదీనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తారని అధికారులు, విమాన ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. స్కూట్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే విశాఖపట్నం-సింగపూర్‌ల మధ్య ఇంటర్నేషనల్ సర్వీసును నడుపుతోంది. ప్రస్తుతం వారానికి మూడు రోజులు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో తిప్పుతోంది. ఇకపై ఈ సర్వీసును విశాఖపట్నం నుంచి కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి నడపనున్నట్టు స్పష్టం చేసింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన నేపథ్యంలో ఇతర విమాన సంస్థలు కూడా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి తమ సర్వీసులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ తేదీపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
విమానాశ్రయం లోపలి భాగం
ఆగమేఘాలపై ఎయిర్‌పోర్టు పనులు..
భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్్డ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు కొన్నాళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పౌరవిమానయాన శాఖ మంత్రి కావడం ఈ ఎయిర్‌పోర్ట్ పనులు చురుగ్గా సాగడానికి దోహదపడ్డాయి. దీంతో ఈ విమానాశ్రయాన్ని నిర్ణీత సమయంకంటే కాస్త ముందుగానే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. తన సొంత జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో దీని పనులు మందకొడిగా సాగితే తనపై విమర్శలు వెల్లువెత్తుతాయన్న ఉద్దేశంతో రామ్మోహన్‌నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తరచూ సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఎయిర్‌పోర్ట్ పనుల ప్రగతిని స్వయంగా పరిశీలిస్తూ వచ్చారు. దీని పనులు వేగవంతమయ్యేలా చూశారు.
ఫ్టైట్లు రడీ.. రోడ్లు నాట్ రడీ..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పరిస్థతి విచిత్రంగా ఉంది. ఎక్కడైనా ఎయిర్‌పోర్టుకంటే ముందుగా రోడ్డు కనెక్టివిటీని పూర్తి చేస్తారు. కానీ ఈ ఎయిర్‌పోర్ట్ పరిస్థితి అందుకు భిన్నం. వైజాగ్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఏడు మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో ఇప్పటివరకు మూడు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నాటికి పూర్తి చేస్తామని వీఎంఆర్డీఏ చెబుతున్నా అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి మరి. కాగా భోగాపురం విమానాశ్రయం విశాఖ నగరానికి దాదాపు 50 కి.మీలు, అనకాపల్లికి 90 కి.మీలు, తుని ప్రాంతానికి 150 కి.మీల దూరంలోనూ ఉంది. ప్రధానంగా ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ వల్ల విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. మున్ముందు ట్రాఫిక్ పెరిగితే ఆ సమయం మరింత అధికమవుతుంది.
ఈ-బస్సులు ఎప్పుడొస్తాయి?
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే ట్యాక్సీకి కనీసం రూ.2000-3000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సొంత కార్లు ఉన్న వారి సంగతి ఎలా ఉన్నా ఇతర విమాన ప్రయాణికులకు ఇది ఎంతో భారమవుతుంది. ఒకవైపు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే టిక్కెట్టుకంటే రానూ, పోనూ ట్యాక్సీ చార్జీ అధికమవుతుందన్న ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-భోగాపురంల మధ్య ఎలక్ట్రిక్ బస్సు (ఈ-బస్సు)లను ప్రవేశపెట్టాలని కొన్నాళ్లుగా విమాన ప్రయాణికులతో పాటు విమాన ప్రయాణికుల సంఘాల ప్రతినిధులూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కొన్నాళ్ల క్రితం మంత్రి లోకేష్ స్పందించి 20 ఈ-బస్సులను భోగాపురం ఎయిర్‌పోర్టుకు పంపుతామని ప్రకటించారు. కానీ వాటి కొనుగోళ్లపై ఇంకా స్పష్టత లేనందున అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అవి వచ్చినా వాటికి చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో లేవు.
సదుపాయాల కల్పన అత్యవసరం..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభాన్ని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (అపాటా) స్వాగతిస్తోంది. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సదుపాయాల కల్పన అత్యవసరమని అంటోంది. గతంలో విశాఖ నుంచి కొలంబో, మలేషియా, బ్యాంకాక్‌లకు డైరెక్ట్ ఫ్లైట్లుండేవి. నేవీ ఆంక్షలతో అవి నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించాలి. ఇదివరకు విశాఖ ఎయిర్‌పోర్టుకు 88 విమాన సర్వీసులుండేవి అవిప్పుడు 60కి తగ్గింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే క్యాబ్‌లకు ఫిక్స్‌డ్ కాస్ట్ కోసం ఊబర్, ఓలాలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. దీంతో చార్జీల పారదర్శకతో ప్రయాణికులకు ఖర్చు ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులను కూడా త్వరగా ప్రవేశపెట్టాలి. వీటితో పాటు లాంజిలు ఏర్పాటు చేయాలి. విమాన ప్రయాణికుల్లో నమ్మకాన్ని పెంచాలి. ప్రత్యేక కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతం కంపెనీలు తమ ఎగుమతులను చెన్నై, హైదరాబాద్‌లకు రోడ్డు మార్గాల ద్వారా పంపుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంలోగా కోస్టల్ కారిడార్ పనులు కూడా మొదలు పెట్టాలి.` అని `అపాటా` ఉపాధ్యక్షులు ఒ.నరేష్‌కుమార్, డీఎస్ వర్మ `ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్` ప్రతినిధికి చెప్పారు.