మద్యం ప్రియులకు సంక్రాంతి ’చేదు‘ కిక్కు
x

మద్యం ప్రియులకు సంక్రాంతి ’చేదు‘ కిక్కు

బాటిల్‌పై మరో రూ. 10 పెంపు.. ఖజానాకు రూ. 1,391 కోట్ల అదనపు ఆదాయం.


సంక్రాంతి సంబరాల్లో ఉన్న మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గట్టి 'కిక్కు' ఇచ్చింది. పండగ వేళ మద్యం ధరలు తగ్గిస్తారని ఎదురుచూసిన వారికి.. బాటిల్‌పై మరో రూ.10 అదనపు భారం మోపుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి రద్దీని 'క్యాష్' చేసుకునేలా, కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. ఒకవైపు సంపద సృష్టిస్తామని చెబుతూనే, మరోవైపు లిక్కర్ ధరలతో ఖజానా నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బార్లకు పన్ను మినహాయింపులు ఇస్తూ, సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడంపై పందెం రాయుళ్లలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జనవరి 8న సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం మేరకు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం, సామాన్యులు ఎక్కువగా వినియోగించే రూ. 99 (180 ఎంఎల్) క్వార్టర్ బాటిళ్లు, బీరు, వైన్, రెడీ టూ డ్రింక్స్ (RTD) మినహా మిగిలిన అన్ని రకాల మద్యం సీసాలపై రూ. 10 చొప్పున ధరను పెంచారు. గతంలోనే ఒకసారి బాటిల్‌పై రూ. 10 పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు రెండోసారి పెంపునకు మొగ్గు చూపడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనంగా ఏడాదికి సుమారు రూ. 1,391 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్‌లో పెరిగే అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపును అమలు చేసినట్లు తెలుస్తోంది.

విమర్శల వెల్లువ: ‘సంపద సృష్టి అంటే ఇదేనా?’

మరో వైపు మద్యం ధరల పెంపుపై మద్యం ప్రియులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామని, నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తెస్తామని పదే పదే హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వరుసగా రెండోసారి ధరలను పెంచుకుంటూ పోవడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా, సామాన్యులపై అదనపు భారం మోపుతూనే, మరోవైపు బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను (ART) తొలగించి లిక్కర్ సిండికేట్‌కు ప్రభుత్వం దాసోహమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి వంటి పెద్ద పండుగ సమయంలో మద్యం అమ్మకాలు గరిష్ట స్థాయిలో ఉంటాయని తెలిసి, ఆ డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని కాసులు వసూలు చేయడానికే ప్రభుత్వం ఈ సమయాన్ని ఎంచుకుందని పందెం రాయుళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం మద్యం ధరల పెంపుతోనే ఖజానా నింపుకుంటున్నారా?' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

వ్యవస్థల ప్రక్షాళన.. సంక్షేమానికి భరోసా!

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం, ఈ ధరల పెంపు కేవలం అదనపు ఆదాయం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు.. ఇది గత ప్రభుత్వం వదిలివెళ్లిన 'అస్తవ్యస్త వ్యవస్థల ప్రక్షాళనలో ఒక భాగం. గత హయాంలో నాసిరకం బ్రాండ్లు, అనారోగ్యకరమైన మద్యం విధానాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఇప్పుడు నాణ్యమైన జాతీయ స్థాయి బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వ మద్దతుదారులు గుర్తుచేస్తున్నారు. నాణ్యతతో కూడిన సేవలు అందించే క్రమంలో ధరల సర్దుబాటు అనివార్యమని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, మరోవైపు 'సూపర్ సిక్స్' వంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమీకరించడం ప్రభుత్వ ప్రాధాన్యత. ముఖ్యంగా పౌర సరఫరాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలకు సొమ్ము వెచ్చించాలంటే ఆ మాత్రం పెంచక తప్పదనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

ఈ సంక్రాంతి సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు ఆర్థికంగా ఖజానాకు ఊపునిస్తుంటే, ఇటు రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది. పారదర్శకత, నాణ్యత అనేవి ప్రభుత్వ నినాదాలు అయితే.. భారం, ఆరోపణలు అనేవి ప్రతిపక్షాల విమర్శలు. ఈ రెండింటి మధ్య 'మందుబాబు' మాత్రం తన జేబు ఖర్చును బేరీజు వేసుకుంటున్నాడు.

Read More
Next Story