
సాయికృష్ణ కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు
లాకప్ మరణం నుంచి శవం మాయం వరకు... కొత్త విషయాలు వెలుగులోకి...
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్‌లో గాదె సాయి కృష్ణ మరణం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటి వరకు స్థానిక స్మశానంలో శవాన్ని కాల్చి బూడిద చేశారని భావించిన పోలీసు విచారణలో ఆ శవం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ఖిల్లా ప్రాంతానికి తరలించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తులో వెల్లడైంది.
సీఐ బావమరిది శివ ప్రధాన పాత్ర?
కేసు విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కృష్ణలంక సీఐ నాగరాజు బావమరిది శివ ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో నివాసం ఉంటున్న శివ చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా నగరంలోని కే హోటల్ ను కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఐ నాగరాజు వ్యవహారాలన్నీ శివ నే చూసుకుంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
సాయి కృష్ణ మరణించిన విషయం సీఐ నాగరాజు కు పోలీసులు తెలియజేయగా శివకు చెప్పండి, “వాడే చూసుకుంటాడు” అని సూచించినట్లు సమాచారం. దీంతో శివ రంగంలోకి దిగి తన ఫార్చ్యూన్ 9999 కారును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు పంపించాడు. ఆ కారులో శవాన్ని తీసుకొచ్చి తన ఇంటికి చేర్చిన డ్రైవర్‌ను మార్చి మరొక డ్రైవర్‌కు కారు అప్పగించి కొండపల్లి ఖిల్లా లో తాను సూచించిన ప్రదేశంలో శవాన్ని మాయం చేయాలని ఆదేశించినట్లు విచారణలో తేలింది.
శవం ఏమైంది?
శవాన్ని కాల్చారా? లేదా పాతిపెట్టారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయాలు SIT దర్యాప్తులో భాగంగా వెల్లడయ్యాయి. సీఐ నాగరాజును ప్రశ్నించడం ద్వారా ఈ కీలక సమాచారం వచ్చినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
SIT దర్యాప్తు కొనసాగుతోంది
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న SIT బృందం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. శివ, డ్రైవర్లు, ఇతర సంబంధితులను విచారిస్తున్నారు. లాకప్ మరణం నుంచి శవం పారవేత వరకు జరిగిన ఘటనల గొలుసు స్పష్టం చేయడంలో SIT కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కేసు విజయవాడలో పోలీసు వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. మానవ హక్కుల సంఘాలు, విపక్షాలు స్వతంత్ర విచారణ కోరుతున్న నేపథ్యంలో SIT దర్యాప్తు ఫలితాలపై ఆసక్తి పెరిగింది.
