
‘‘రిజర్వేషన్ హటావో, ఈ20 జనతా పార్టీ’’
సీజేపీ తరహాలో మరో రెండు ఉద్యమాలు
దేశవ్యాప్తంగా ఇటీవల సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్న పౌర ఉద్యమాలు వేగంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సీజేపీ (CJP) ఉద్యమం విజయంతో ప్రేరణ పొందిన కొత్త ఆన్‌లైన్ ప్రచారాల్లో E20 జనతా పార్టీతో పాటు రిజర్వేషన్ హటావో ఆందోళన్ (RHA) ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి రాజకీయ పార్టీలుగా కాకుండా పౌరుల స్వచ్ఛంద ఉద్యమాలుగా తమను తాము పేర్కొంటున్నాయి.
E20 జనతా పార్టీ ఏమి కోరుతోంది?
ప్రస్తుతం దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ E20 జనతా పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని, E20తో పాటు సాధారణ 100 శాతం పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని ఈ వేదిక డిమాండ్ చేస్తోంది.
ఈ ఉద్యమం ప్రకారం తమ లక్ష్యం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం కాదు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఎంపిక కల్పించడం, ఇంధన విధానంలో పారదర్శకత తీసుకురావడం, మైలేజ్, ఇంజిన్ పనితీరు, నిర్వహణ ఖర్చులపై స్వతంత్ర అధ్యయనాలను బహిరంగపరచాలని మాత్రమే కోరుతోంది.
E20 ఇంధనం పాత వాహనాలపై చూపే ప్రభావం, ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఈ వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే సమయంలో నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ కూడా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
అయితే తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన దావాలో పేర్కొన్నారు.
పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు
E20 విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్ ముట్టడికి పిలుపు కూడా వెలువడింది. ఢిల్లీ టాక్సీ, టూరిస్ట్ ట్రాన్స్‌పోర్టర్స్ మరియు టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్‌తో పాటు వాణిజ్య వాహన యజమానులు ఈ నిరసనలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఇంధన సామర్థ్యం, వాహన పనితీరు, నిర్వహణ ఖర్చులపై తమ ఆందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల వాహనాలకు విస్తృతంగా నష్టం జరుగుతోందని నిరూపితమైన ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ముడి చమురు దిగుమతులు తగ్గించడం, కాలుష్య నియంత్రణ, చెరకు రైతులకు మేలు చేయడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం కోసం E20 విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగం కొనసాగుతోందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
రిజర్వేషన్ హటావో ఆందోళన్
మరోవైపు సోషల్ మీడియాలో వేగంగా ఎదుగుతున్న రిజర్వేషన్ హటావో ఆందోళన్ (RHA) కూడా విస్తృత చర్చకు దారితీసింది. కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేసి, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా అవకాశాలు కల్పించాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తోంది. ప్రజా జీవితంలో కుల గుర్తింపును తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ ఉద్యమానికి ఇప్పటికే లక్షలాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు చేరారు. అయితే రిజర్వేషన్ వ్యవస్థ చారిత్రక సామాజిక అసమానతలను తగ్గించేందుకు అవసరమని కొందరు వాదిస్తుండగా, ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా ఉద్యమాలపై ఆసక్తి
సీజేపీ తరహాలోనే ఈ రెండు ఉద్యమాలు కూడా మీమ్స్, సోషల్ మీడియా ప్రచారం ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు ప్రజా మద్దతు సంపాదిస్తాయి? భవిష్యత్తులో వాస్తవ రాజకీయ లేదా విధాన మార్పులపై ఎంత ప్రభావం చూపుతాయి? అనే అంశాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

