
ఈ తేదీని గుర్తు పెట్టుకోండి..నీళ్లిస్తారట
ఖరీఫ్-2026 సాగునీటి విడుదల
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి సాగునీటి విడుదల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సచివాలయంలో ఈరోజు (సోమవారం) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి సమీక్షలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచే కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.
ఏ డెల్టాకు ఎప్పుడు?
రాష్ట్రంలోని వివిధ ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేసేందుకు మంత్రులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయా తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
గోదావరి డెల్టా: జూన్ 1 నుంచి
వంశధార ఆయకట్టు: జూన్ 15 నుంచి
కృష్ణా డెల్టా: జూలై 1 నుంచి
కె.సి. కెనాల్: జూలై 15 నుంచి
నాగార్జున సాగర్ ఆయకట్టు: జూలై చివరి వారం నుంచి
రైతులంతా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. నీటి విడుదలకు ముందే కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరి నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్లలో పుష్కలంగా జలాలు
గత సీజన్ (2025-26) ఖరీఫ్‌లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీటిని, రబీ సీజన్‌లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీటిని విజయవంతంగా అందించామని మంత్రులు గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కాబట్టి ఖరీఫ్ సాగుకు నీటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు.
అధికారులకు హెచ్చరిక.. రైతులకు యూరియా కార్డులు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్-2026 ప్రణాళికలు, ఎల్ నినో ప్రభావంపై సమీక్షించారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెప్తూనే, అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎరువులు పక్కదారి పడితే ఊరుకునేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రైతులకు ప్రత్యేకంగా యూరియా కార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. అవసరాన్ని బట్టి ఈ కార్డు ద్వారానే రైతులు యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల వల్ల యూరియా దిగుమతులకు కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని, కాబట్టి ముందస్తుగా నిల్వలు పెట్టుకోకుండా.. అవసరం ఉన్న మేరకే వాడుకోవాలని కోరారు. రెండు, మూడు దశల్లో నానో యూరియాను వినియోగించాలని రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
Next Story

