
TTD | నిరుద్యోగ ఇంజినీర్లకు గుడ్ న్యూస్ : 56 ఖాళీల భర్తీకి ముహూర్తం
మే 10, 11 తేదీల్లో టీటీడీ ఇంజినీరింగ్ కొలువుల పరీక్షలు. పూర్తి వివరాలు ఇవే.
దరఖాస్తు చేసుకుని 30 నెలలుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగ ఇంజినీర్ పట్టభద్రులకు టీటీడీ తీపి కబురు అందించింది. ఇంజినీరింగ్ విభాగంలో సుదీర్ఘవిరామం తరువాత భారీగా 56 సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తంగా ఖరారైంది. పరీక్షల షెడ్యూల్ కూడా టీటీడీ శుక్రవారం వెల్లడించింది. సుమారు 3,500 మంది నిరుద్యోగ ఇంజినీరింగ్ పట్టభద్రులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తాం. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీఓ (సివిల్) పోస్టులను భర్తీ చేస్తాం. అని టీటీడీ అధికారులు ప్రకటించారు.
పరీక్షల షెడ్యూల్..
AEE (సివిల్) – 10.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
AEE (ఎలక్ట్రికల్) – 10.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు
AE (సివిల్) – 11.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
ATO (సివిల్) – 11.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు
అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను ఏప్రిల్ 24 వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్ లైన్ లో ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు హాల్ టికెట్లను మే రెండో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష షిఫ్ట్ వివరాలను పరిశీలించి, అవసరమైన అభ్యర్థి నిర్ధారణ (కాండిడేట్ కన్ఫర్మేషన్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని టిటిడి సూచించింది.
హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు వివరాలు టిటిడి వెబ్ సైట్ https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/TTDExamPreferences.aspx లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నంబర్ 155257ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.
పోస్టులు ఇవీ..
1) అసిస్టెంబ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు 27
2) అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులు 10
3) అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 19
భారీ బడ్జెట్..
తిరుమలతో పాటు తిరుపతి దేశంలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద పనులు నిరంతరాయంగా సాగుతుంటాయి. అందులో కొత్త పనులు చేపట్టడం, భవనాలు, రహదారుల ఆధునీకరణ వంటి పనుల్లో టీటీడీ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుంది.
2025- 26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ రూ.5,258.68 కోట్ల బడ్జెట్ కు ధర్మకర్తల మండలి ఆమోదించింది. గత ఏడాది మార్చి 24వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్ ఆమోదించారు.
"ఇంజినీరింగ్ విభాగంలో క్యాపిటల్ వర్కులకు 350 కోట్ల రూపాయలు కేటాయించాం. రు. 150 కోట్లు ఇంజినీరింగ్ విభాగంలో పనుల నిర్వహణకు కేటాయించాం" అని గతంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించిన విషయం తెలిసిందే.
30 నెలల తరువాత మోక్షం..
టీటీడీలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు అధికారులు, సిబ్బందిపై పనిభారం పెరిగింది. సుదీర్ఘవిరామం తరువాత ఇంజినీరింగ్ విభాగంలో వివిధ కేటగిరీల కింద 56 ఏఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ 2023 నవంబర్ 23వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ఈ పరీక్ష నిర్వహణ వాయిదా పడుతూనే ఉంది. మొత్తం 56 పోస్టుల కోసం 37,121 మంది నిరుద్యోగ ఇంజినీరింగ్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం 42 సంవత్సరాల వయోపరిమితి విధించింది. 2024 ఎన్నికలు సమీపించడంతో ఈ అర్హత పరీక్ష నిర్వహణ మాటే మరిచారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరీక్ష నిర్వహించాలని భావించారు. అనేక కారణాలతో మళ్లీ వాయిదా పడింది.
"టీటీడీలో ఏఈల నియామానికి ఏప్రిల్ నెలల అర్హత పరీక్షకు తేదీలు ఖరారు చేయాలని" టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఆశలు చిగురించాయి. పరీక్ష నిర్వహణపై నీలినీడలు తొలకలేదు. 30 నెలల తరువాత నిర్వహించబోతున్న ఈ పరీక్షకు హాజరు కావాలని దరఖాస్తు చేసిన వారిలో చాలా మందికి వయోపరిమితి దాటిపోయిన పరిస్థితి ఉంది.
Next Story

