నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
x

నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

సోమవారం రాష్ట్రంలోని సుమారు 27 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం.


రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో 46.2°C ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్లోనే అత్యధికంగా నిలిచింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C, మార్కాపురం కంభంలో 45.7°C మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 286 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

సోమవారం వడగాలుల హెచ్చరిక
సోమవారం రాష్ట్రంలోని సుమారు 27 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ద్రోణి ప్రభావంతో పిడుగుల వానలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్ష సూచన కూడా ఉంది. సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చు.
రైతులకు కీలక సూచనలు
ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే వారు పిడుగుల ముప్పు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం నాటికి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అత్యధికంగా 72.7 మి.మీ వర్షపాతం నమోదైంది.
Read More
Next Story