
ఏపీలో మారిన రంజాన్ సెలవు: టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
గురువారం నెలవంక కనిపించకపోవడంతో, ముస్లిం సోదరులు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలు కొనసాగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ సెలవు దినాన్ని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మార్చి 20వ తేదీన (శుక్రవారం) ప్రకటించిన రంజాన్ సెలవును, ఇప్పుడు మార్చి 21వ తేదీకి (శనివారం) మారుస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గురువారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా గురువారం నెలవంక కనిపించకపోవడంతో, ముస్లిం సోదరులు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలు కొనసాగించనున్నారు. మతపెద్దల నిర్ణయం ప్రకారం, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను శనివారం (మార్చి 21న) జరుపుకోనున్నారు. పండుగ రోజునే సెలవు ఉండాలన్న నిబంధన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్పు:
రంజాన్ సెలవు మారడంతో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చి 21న (శనివారం) జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ వాయిదా పడిన పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
వరుస సెలవులు:
ప్రభుత్వ తాజా నిర్ణయంతో మార్చి 21న శనివారం రంజాన్ సెలవు, ఆ మరుసటి రోజు మార్చి 22న ఆదివారం సాధారణ సెలవు కావడంతో ఉద్యోగులకు, విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి.
శుక్రవారం (మార్చి 20): అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.
శనివారం (మార్చి 21): రంజాన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుంది.
Next Story

