గాజువాకలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి
x

గాజువాకలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు


గాజువాక పరిధిలోని తుంగ్లం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో వడ్లపూడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో పరంజా (Saffolding) భారం తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ అపశృతి చోటుచేసుకుంది.

సహాయక చర్యలు .. బాధితుల వివరాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కూలిన శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను అతి కష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారిని బుద్ధీశ్వర్, బోస్, అజిత్, దినేశ్, తుసర్, ప్రతాప్, ఉదయ్‌గా గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే కిమ్స్ (KIMS) ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ట్రాఫిక్ కష్టాల తీర్చే ప్రయత్నంలో అపశృతి
దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో స్థానికులు, వాహనదారులు కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టింది. కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ పనుల్లో భాగంగా డకింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
విచారణకు ఆదేశం
వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయా లేదా ఇంజనీరింగ్ లోపం వల్ల పరంజా కూలిపోయిందా అనే కోణంలో సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించారా లేదా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Read More
Next Story