పులి మెడలో రేడియో కాలర్..పోలవరం ప్రాజెక్ట్ వద్ద హై అలర్ట్
x

పులి మెడలో రేడియో కాలర్..పోలవరం ప్రాజెక్ట్ వద్ద హై అలర్ట్

పులి గాండ్రించడంతో, కార్మికులు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు.


పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో ఇప్పుడు మృత్యుఘోష వినిపిస్తోంది. ఎప్పుడూ యంత్రాల హోరుతో బిజీగా ఉండే ప్రాజెక్ట్ పనుల మధ్య, ఒక్కసారిగా పెద్ద పులి ప్రత్యక్షం కావడంతో కార్మికుల వెన్నులో వణుకు మొదలైంది. సరదాగా చూసే వన్యప్రాణి కాదు.. సాక్షాత్తూ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమైన వారి కళ్లముందే పులి గాండ్రించడంతో, కార్మికులు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు. జనసంచారం అధికంగా ఉండే నిర్మాణ ప్రాంతంలోకే ఈ క్రూర మృగం చొరబడటం.. అటవీ శాఖ రేడియో కాలర్ ద్వారా దాని కదలికలను శాటిలైట్ సాయంతో ట్రాక్ చేస్తుండటం ఇప్పుడు పోలవరం వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎప్పుడు, ఏ పొద చాటు నుంచి పులి పంజా విసురుతుందో తెలియక అటు అధికారులు, ఇటు కార్మికులు ఊపిరి బిగబట్టి గడుపుతున్నారు.

ట్రాకింగ్‌లో రేడియో కాలర్ కీలకం
రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పులి మెడలో రేడియో కాలర్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఇది అధికారులకు ఒక విధంగా కలిసొచ్చే అంశంగా మారింది. ఈ కాలర్ నుంచి వెలువడే శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పులి ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉంది? ఏ దిశగా కదులుతోంది? అన్న విషయాలను అధికారులు నిమిష నిమిషానికి ట్రాక్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పులి కదలికలను పసిగడుతూ, అది జనారణ్యంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బంధించేందుకు అనస్థీషియా బృందం సిద్ధం
పులి సంచారం తీవ్రమవ్వడంతో దానిని బంధించేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. రాజమండ్రి నుంచి ప్రత్యేక అనస్థీషియా (మత్తుమందు) నిపుణుల బృందం ఇప్పటికే పోలవరం చేరుకుంది. పులికి మత్తుమందు ఇచ్చి బంధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పులి రాకపోకలు సాగించే అవకాశం ఉన్న మార్గాల్లో పటిష్టమైన బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు, అటవీ సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తున్నారు.
అధికారుల హెచ్చరిక - అప్రమత్తత
పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు, అటవీ శాఖ కార్మికులకు, స్థానిక ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ ఒంటరిగా తిరగవద్దని, రాత్రి సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. పులిని బంధించే ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రేడియో కాలర్ ద్వారా ట్రాక్ చేస్తున్నప్పటికీ, వన్యప్రాణి కావడంతో అది ఏ క్షణంలో ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం పోలవరం పరిసరాల్లో కొనసాగుతోంది.
Read More
Next Story