
బాబు వద్దకు చేరిన పుంగనూరు పంచాయితీ..
నేతలపై సస్పెన్షన్ వేటు. తంబళ్లపల్లెలో ఆగని పోరు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. ఈ రెండు నియోజకవర్గాల పంచాయితీ విజయవాడకు చేరింది. జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి టీడీపీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారంటూ, పుంగనూరు టీడీపీ నేతల్లో కొందరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ప్రాతినిధ్యం వహించే తంబళ్లపల్లెలో పై చేయి సాధించాలనేది టీడీపీ వ్యూహం. దీనికోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆ రెండు నియోజకవర్గాల్లోని రెండు గ్రూపుల్లో నేతలు పరస్పర దాడులకు పాల్పడడం వల్ల క్రమశిక్షణ మాట అటుంచితే, వైసీపీకి అనుకూలించే పరిస్థితి ఏర్పడడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వ్యూహాలకు అవరోధం..
రానున్న స్థానిక సంస్థల నాటికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. అయితే, జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జి నియామకం, పుంగనూరు ఇన్ చార్జి చల్ల బాబు పనితీరును సమీక్షించి, నాయకత్వ మార్పిడిపై అభిప్రాయ సేకరణ కోసం తిరుపతిలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, బీసీ. జనార్థనరెడ్డి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి క్లస్టర్, బూత్ కమిటీల బాధ్యులకు సమాచారం ఇవ్వడం ద్వారా సమావేశానికి హాజరయ్యే వారి జాబితా సిద్ధం చేశారు. ఆ మేరకే తిరుపతిలోని ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి అనుమతించారు. టీడీపీలో ఆ రెండు నియోజకవర్గాల్లోని రెండు గ్రూపుల మధ్య కొట్లాటకు దిగారు. మంత్రుల ముందే పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే.
ఘర్షణలకు కారణం ఇదీ..
తంబళ్లపల్లె మాజీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డిపై ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో శంకర్ యాదవ్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని పార్టీలోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ అభిప్రాయ సేకరణ సమావేశానికి కేవలం కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇవ్వడంపై సస్పెండైన నేత జయచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పిలుపుతో పెద్ద సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలు హోటల్‌కు చేరుకోవడంతో ఉదయం నుంచే వాతావరణం వేడెక్కింది.
పుంగనూరు నేతల దాడులు
తిరుపతిలోని ఓ హోటల్ లో నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సమావేశం రక్తసిక్తమైంది. పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే, నాయకుల మాట అటుంచితే, కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పుంగనూరు ఇన్ చార్జి బాధ్యతల నుంచి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)ను తప్పించి, ఆ స్థానంలో
మధుసూదన్ నాయుడును నియమించాలని పుంగనూరు నేతలు మంత్రులు బీసీ. జనార్ధనరెడ్డి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి వద్ద ప్రతిపాదించారు. దీంతో చల్లా బాబును మారిస్తే, సహించేది లేదని ఆయన వర్గీయులు గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీయడం, పులిచర్ల మండలానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణపై దాడికి దిగారు. తలకు రక్త గాయాలైన ఆయన ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో పార్టీ సమావేశం రణరంగంగా మారింది. ముల్లంగి వెంకటరమణ మధుసూదన్ నాయుడు పక్షాన ఉండడం వల్లే చల్లా బాబు వర్గం దాడికి పాల్పడినట్లు పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. దీంతో ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గాయపడడం, మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనల నేపథ్యంలో మంత్రులు బీసీ. జనార్థనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయ సేకరణ సమావేశాన్ని రద్దు చేశారు. గాయపడిన జర్నలిస్టులను పరామర్శించారు.
"జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయిస్తాం. వారిని అరెస్టు చేయిస్తాం" అని జర్నలిస్టులకు మంత్రులు జనార్ధనరెడ్డి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ ఘటనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అమరావతికి మారిన సీన్
తిరుపతిలో తంబళ్లపల్లె, పుంగనూరు టీడీపీ నేతల మధ్య ఘర్షణను చక్కదిద్దడం, పరిస్థితిని శాంత పరచడానికి విఫలయత్నం చేశారు. కార్యకర్తలు శాంతించని స్థితిలో ఈ పంచాయతీ విజయవాడలో తేలుస్తామని చెప్పారు.
"ఈ రెండు నియోజకవర్గాలపై త్వరలో విజయవాడలో ప్రత్యేక సమావేశం ఉంటుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు" అని మంత్రులు స్పష్టం చేశారు. బలప్రదర్శనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నివేదిక అంతా అధిష్టానం వద్ద ఉందని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.
సస్పెన్షన్ వేటు..
తిరుపతి సమావేశంలో జరిగిన పరిణామాలపై ఒక రోజు కూడా గడవకనే టీడీపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా స్పందించింది. పుంగనూరు నియోజకవర్గ నేతల్లో ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహ్మద్ అక్రమ్, షేక్ కరీముల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారని పుంగనూరు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మనోజ్ కుమార్, సందీప్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన మెజారిటీ నేతలు ఇన్ చార్జులపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. రెండు సెగ్మెంట్లలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నేతలు లోపాయికారీ ఒప్పందాలతో వైసీపీ నేతలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు మీడియా ముందు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తంబళ్లపల్లె, పుంగనూరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా ఫోకస్ పెట్టారని సమాచారం.
Next Story

