
Journalist Suparna Sharma and illustrator Anand RK. Image credits/Instagram
జర్నలిజం విశ్వవేదికపై ఎగిరిన భారతీయ జెండా!
పులిట్జర్ విజేతలుగా ఇండియన్ జర్నలిస్టులు సుపర్ణ, ఆనంద్!
అంతర్జాతీయ జర్నలిజం రంగంపై భారతీయ జెండా ఎగిరింది. జర్నలిజంలో అత్యున్నత గౌరవమైన పులిట్జర్ అవార్డ్ ఈ సారి ఇద్దరు భారతీయులను వరించింది. భారతీయ జర్నలిజం చరిత్రలో ఇదో మైలురాయి. ఆనంద్ ఆర్.కె., సుపర్ణా శర్మ- అనే ఇద్దరు భారతీయులు బ్లూమ్‌బెర్గ్ కోసం చేసిన “trAPPed” అనే పరిశోధనాత్మక కథనానికి- Illustrated Reporting and Commentary- విభాగంలో పులిట్జర్ అవార్డ్ గెలిచారు. వీరిద్దరూ బ్లూమ్‌బెర్గ్ సీనియర్ రిపోర్టర్ నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఈ అవార్డును అందుకోనున్నారు.
ఏమిటీ రిపోర్ట్?
“trAPPed” అనే ఈ రిపోర్ట్ ఓ సాదాసీదా భారతీయ మహిళ జీవనానికి సంబంధించింది. లక్నోకు చెందిన న్యూరాలజిస్ట్ (నాడీ వైద్యురాలు) జీవితం చుట్టూ తిరిగే కథనం ఇది. ఆమెకి వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. “డిజిటల్ అరెస్ట్” అనే కొత్త రకం మోసం ఆమె బతుకును బీభత్సం చేస్తుంది. ఏమి చేయాలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటుంది. సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా ఎలా భయపెట్టి, బంధించి, ఆమె ఖాతాల నుంచి డబ్బులు కాజేశారనే అంశాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రాలతో (Visual Storytelling) వివరించారు. దాని తాలుకు చిత్రాలు, వ్యాఖ్యానాలతో ఈ కథనం సాగుతుంది. సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తుంది.
సైబర్ మోసగాళ్లు ఎలా సాంకేతికతను ఉపయోగించి సామాన్యులను భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో, డిజిటల్ నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఈ రిపోర్ట్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది.
ఎవరీ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె., సుపర్ణా శర్మ.
ఆనంద్ ఆర్.కె. ముంబైకి చెందిన ప్రముఖ ఇలస్ట్రేటర్. గ్రాఫిక్ నవలల్లో దిట్ట. Blue in Green, Grafity’s Wall అనేవి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చాయి. ఇప్పటికే 2021లో Eisner Award (కామిక్స్ రంగం) కూడా గెలుచుకున్నారు.
సుపర్ణా శర్మ ఢిల్లీకి చెందిన అనుభవజ్ఞులైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె క్రైమ్, కరప్షన్, సామాజిక సమస్యలపై లోతైన రిపోర్టింగ్ చేస్తుంటారు.
ఈ అవార్డు ప్రాముఖ్యత..
పులిట్జర్ అవార్డ్ జర్నలిజం రంగంలో ప్రపంచ స్థాయి అత్యున్నత గౌరవం. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ విభాగంలో భారతీయులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ రిపోర్ట్ డిజిటల్ యుగంలో మనం ఎదుర్కొంటున్న కొత్త తరం మోసాలు, నిఘా సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది.
ఈ అవార్డు రావడంపై సుపర్ణా శర్మ మాట్లాడుతూ.. “ఈ రిపోర్ట్ ఒక వ్యక్తి బాధ.. ఒక్క ఫోన్ కాల్ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించడానికి ప్రయత్నించింది. ఇది మన అందరి కథ కావచ్చు.” అన్నారు.
ఆనంద్ ఆర్.కె. ఈ అవార్డ్‌ను భారతీయ యువ జర్నలిస్టులు, ఇలస్ట్రేటర్లకు ప్రోత్సాహంగా అభివర్ణించారు.
ఇది కేవలం ఇద్దరు జర్నలిస్టుల విజయం కాదు. ఇది భారతీయ జర్నలిజం సామర్థ్యానికి, సాహసానికి, కథ చెప్పే విధానానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు.
అంతర్జాతీయ రిపోర్టింగ్ లో అనిరుద్ధ ఘోషల్ ఎంపికయ్యారు. అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press) బృందంతో కలిసి చేసిన మాస్ సర్వైలెన్స్ (Mass Surveillance) ఇన్వెస్టిగేషన్ కి ఈ అవార్డు వచ్చింది.
సిలికాన్ వ్యాలీలో తయారైన అధునాతన నిఘా పరికరాలు చైనా వంటి దేశాల్లో ఎలా వ్యాపించాయి, వాటిని పౌరులు, వలసదారులపై ఎలా ప్రయోగిస్తున్నారనే అంశాన్ని ఈ బృందం బయటపెట్టింది.
గతంలో పులిట్జర్ గెలిచిన ఇండియన్స్ లో..
జర్నలిజం, సాహిత్య రంగాల్లో గతంలో కూడా పలువురు భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు ఈ అవార్డును గెలుచుకున్నారు.
గోవింద్ బిహారీ లాల్ (1937): పులిట్జర్ పొందిన మొదటి భారతీయుడు. సైన్స్ రిపోర్టింగ్ విభాగంలో ఈయనకు అవార్డు దక్కింది.
ఝుంపా లాహిరి (2000): ఫిక్షన్ విభాగంలో 'ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మలాడీస్' పుస్తకానికి గానూ ఈమెకు అవార్డు వచ్చింది.
గీతా ఆనంద్ (2003): వాల్ స్ట్రీట్ జర్నల్ తరపున ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో అవార్డు సాధించారు.
సిద్ధార్థ ముఖర్జీ (2011): 'ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్' అనే పుస్తకానికి జనరల్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో ఈయనకు గౌరవం దక్కింది.
అద్నాన్ అబిదీ, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దవే (2022): కోవిడ్ సమయంలో తీసిన ఫోటోలకు గానూ ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు.
ఈ విజయం భారతీయ జర్నలిజం స్థాయిని, అంతర్జాతీయ వేదికలపై మన వారు చేస్తున్న పరిశోధనాత్మక కృషిని మరోసారి చాటిచెప్పింది.
Next Story

