
ఢిల్లీలో ప్రారంభమైన నిరసన ర్యాలీ
కన్నాట్ కూడలికి చేరుకున్న విపక్ష ఇండి కూటమి నాయకులు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్) ను నిలిపివేయాలని ఇండి కూటమి భారీ నిరసన ర్యాలీకి సిద్దమవుతోంది. ఢిల్లీ లోని కన్నాట్ కూడలి వద్దకు నాయకులు చేరుకున్నారు.
చల్లో ఢిల్లీ నిరసన..
‘చలో ఢిల్లీ’ నిరసనకు దేశ రాజధానికి తరలిరావాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ లో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ మధ్యాహ్నం మింటో రోడ్ కన్నాట్ ప్లేస్ నుంచి బయలుదేరీ రామ్ లీలా మైదానంలో ముగిసేలా ప్లాన్ చేశారు. కూటమిలోని సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభ స్థానం వరకూ బహిరంగ బస్సులలో ప్రయాణించే అవకాశం ఉంది.
రామ్ లీలా మైదాన్ లో సీనియర్ ప్రతిపక్ష నాయకుల కోసం ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై ఒక పెద్ద త్రివర్ణ పతకాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఇండి కూటమి రాష్ట్ర విభాగాల ప్రతినిధుల కోసం రెండో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వరుసగా తెల్లటి వేదికలను ఏర్పాటు చేశారు. రాకపోకలను నియంత్రించడానికి బారికేడ్లను పెట్టారు.
పార్టీల కార్యకర్తల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. జనసమూహాన్ని నియంత్రించడానికి వాలంటీర్లను నియమించాలని, మహిళలకు తాగునీరు, ప్రత్యేక వాష్ రూమ్ లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అలాగే ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నిరసనలకు కేవలం సాయంత్రం వరకే అనుమతి ఉంది. రాత్రిపూట కూడా ఇక్కడ బస చేయడానికి ఎలాంటి అనుమతి లేదు.
రాహుల్ ఏమన్నారంటే...
నిరసనల కోసం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది ఇప్పటికే ఢిల్లీకి వచ్చారు. ఆదివారం ఉదయం చాలామంది వస్తారని అంచనా వేస్తున్నారు. తమ వ్యాపారాలకు నష్టం కలిగించవద్దని ఇప్పటికే ఢిల్లీ వ్యాపారులు కోరినప్పటికీ.. రాహుల్ గాంధీ ఆ విన్నపాలను పట్టించుకోలేదు. తమ కార్యకర్తలు స్థానిక వ్యాపారుల దగ్గర దీపావళి, ఛత్, భాయ్ దూజ్ పండగల కొనుగోళ్లు చేయాలని కోరారు.
భారీ భద్రతా..
ప్రతిపక్షాలు 10 వరకు ప్రజలు రావాలని పిలుపునివ్వగా, కేవలం 50 వేల వరకు మాత్రమే వస్తారని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. రామ్ లీలా మైదాన్ దాదాపు లక్ష మంది జనం కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. కుర్చీలు వేస్తే 50 వేల మందికి సరిపోతుంది. ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 50 వేల పోలీసులను మెహరించారు. అదనపు బలగాలను సైతం సిద్దంగా ఉంచినట్లు సీనియర్ అధికారులు చెబుతున్న మాట.
మైదానం వెలుపల..
నిరసన ర్యాలీ నిర్వహించడానికి భారీ భద్రత సిబ్బందిని మోహరించారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఉన్నాయి. మైదానాన్ని 14 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్ కు ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షిస్తారు. నిఘా కోసం 200 సీసీటీవీలు, వందలాది బాడీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Live Updates
- 1 Nov 2026 4:50 PM IST
సీఈసీ తరువాత మోదీ, షా లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సీఈసీ పై చర్యలు తీసుకున్న తరువాత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే భారత్ ను తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. రైతు కష్టపడితే, అతనికి ప్రతిఫలం దక్కాలి. ఒక విద్యార్థి రోజుకు 18 గంటలు చదివితే విద్యావ్యవస్థ అతనికి ప్రతిఫలం ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు.కార్పొరేట్ కేంద్రీకరణపై కూడా ఆయన విమర్శలు చేశారు. అదానీల ప్రతిదీ కైవసం చేసుకునే రెండు మూడు వ్యక్తుల దేశాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. దేశాన్ని గాడిన పెట్టిన తరువాత నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి హెచ్చరించారు.నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లడం లేదని అమిత్ షా అంటున్నారు. మేము కూడా మోదీని ఎక్కడికి వెళ్లనివ్వమని ఆయనకు చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానేశ్ కుమార్ తరువాత మోదీ, షా ల కోసం వస్తాము. జ్ఞానేశ్ కుమార్ తరువాత మోదీ, షా లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. - 1 Nov 2026 4:28 PM IST
బీజేపీని ఓడించండి: తేజస్వీ యాదవ్..
త్వరలో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడించాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కోరారు. ప్రధాని దేశాన్నా.. జ్ఞానేశ్ కుమార్ ఎవరో ఒకరిని ఎంచుకోవాలని సవాల్ చేశారు. దేశాన్ని ఎన్నికల పేరిట మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజస్వామ్యాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ఆరోపించారు. యూపీలో దాదాపు 1.27 కోట్ల హిందువుల ఓట్లను సర్ ద్వారా తొలగించారని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిని బీజేపీ రక్షించే ప్రయత్నం చేస్తున్నందునే విపక్షాలు ఏకమయ్యాయని తెలిపారు.వారణాసిలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలను తారుమారు చేసి ఓట్ల దొంగతనం కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2022 లో కూడా బీజేపీ ఓట్లను తారుమారు చేసి యూపీలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి తమ పార్టీ అఫిడవిట్లు, సాక్ష్యాధారాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ ఓటర్లు మాత్రమే దేశ పౌరులుగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన అన్నారు. - 1 Nov 2026 4:08 PM IST
మహిళలు, దళితులు, పేదల ఓట్లను తొలగిస్తున్నారు: ఖర్గే
ఢిల్లీలో జరుగుతున్న ఇండి కూటమి ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మహిళలు, దళితులు, పేదల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం కుమార్ ను ఒక పావుగా వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు. సీఈసీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలను చేసేందుకు ప్రభుత్వం కుమార్ ను ఒక పావుగా వాడుకుంటోంని ఖర్గే ఆరోపించారు.‘‘ఇది చారిత్రాత్మక ర్యాలీ.. మోదీ, షా మహిళలు, పేదల ఓట్లను దొంగలించారు. ఇదంతా చేయడానికి మోదీ జ్ఞానేశ్ కుమార్ ను ఒక పావుగా వాడుకుంటున్నారు. జ్ఞానేశ్ కుమార్ ను తొలగించే వరకూ మేము విశ్రమించబోము. అదే లక్ష్యంతో మేమందరం ఇక్కడికి వచ్చాము’’ అని ఖర్గే అన్నారు. మోదీ, షాలు సీఈసీని రక్షించలేరని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ పాతాళంలో దాక్కుకున్నా మేము అతని విడిచిపెట్టము’’ అని ఖర్గే అన్నారు. - 1 Nov 2026 2:53 PM IST
అల్లర్లు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు: పీయూశ్ గోయల్
ఢిల్లీలో జరుగుతున్న ఇండి కూటమి ర్యాలీపై కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ ఆదివారం స్పందించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లను విమర్శిస్తూ .. అల్లర్లను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం రాజ్యాంగం, ప్రజల తీర్పు ద్వారా పాలన జరుగుతోందని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ దాని మిత్రపక్షాల రాజకీయాల ద్వారా కాదని అన్నారు. ఈ ర్యాలీ కాంగ్రెస్ రాజకీయ పతనానికి చివరి మేకు అవుతుందని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ పై కూడా సునిశితమైన విమర్శలు చేశారు. - 1 Nov 2026 2:46 PM IST
రెజీమ్ ఛేంజ్ దిశగా పయనిస్తున్నాం: సంజయ్ రౌత్
ఎన్నికల కమిషనర్ ను తొలగించాలని విపక్షాలు చేస్తున్న ఆందోళనలో శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడారు. ఇండి కూటమి నిర్వహించిన ర్యాలీని విప్లవంగా అభివర్ణించారు. ప్రతిపక్ష కూటమి ప్రభుత్వ మార్పు దిశగా పయనిస్తోందని ఆయన అన్నారు. ‘‘క్రాంతి ఆ రహీ హై.. హమ్ పాలన మార్పుకి తరఫ్ జా రహే హై( విప్లవం వస్తోంది. మేము పాలన మార్పు వైపు వెళ్తున్నాము) అని అన్నారు. - 1 Nov 2026 2:36 PM IST
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే: మణికం ఠాగూర్
ఢిల్లీలో జరిగిన ఇండి కూటమి భారీ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాగూర్ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం తమ డిమాండ్ కు ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తోందని ఠాగూర్ అన్నారు.‘‘ఉత్సాహం ఉప్పొంగుతోంది. మీరు కూడా జోష్ చూస్తున్నారు. మాకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కావాలి. మేము అడుగుతున్నది ఒక్కటే.. ప్రజాశక్తి ముందు ప్రతి ఒక్కరూ తలవంచాల్సిందే’’ అని ఆయన అన్నారు. - 1 Nov 2026 2:28 PM IST
మెగా ర్యాలీతో ‘ఓట్ చోరీ’ ప్రచారం..
ఇండి కూటమి తన ఓట్ చోరీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ నుంచి రామ్ లీలా మైదాన్ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్ ను నిలిపివేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సర్ ద్వారా తొలగించిన ఓట్లను తిరిగి జత చేయాలని కోరుతున్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే సహ ఇండి కూటమి నాయకులు మింట్ రోండ్ నుంచి రామ్ లీలా మైదాన్ వరకూ పాదయాత్ర చేయనున్నారు. అంతకుముందు వీరంతా ఢిల్లీలోని కన్నాట్ కూడలి వరకూ చేరుకున్నారు.
Next Story

