సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ సరికాదు
x
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ సరికాదు

జీవో 396 ఉపసంహరించాలి: సీపీఐ


ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. జీవో నెం.396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 296 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యాలయాల్లో లక్షలాది మంది దస్తావేజు లేఖకులు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖకులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. ఈ నెల 20 నుంచి 31 వరకు పూర్తి పెన్‌డౌన్ చేస్తున్నారని ఆయన వివరించారు.

ప్రభుత్వ విభాగాలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఆధునీకరణ, పీపీపీ పేరుతో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ప్రైవేటీకరించడం తగదని ఈశ్వరయ్య అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణ అసంతృప్తికరమని స్పష్టం చేశారు. ఆస్తుల విలువలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అనేక లోపాలు వెలుగు చూస్తుండగా, ప్రైవేటు చేతుల్లోకి వెళ్లితే అవినీతి, అక్రమాలు మరింత పెరిగి పరిస్థితి దయనీయంగా మారుతుందనడంలో సందేహం లేదని ఆయన హెచ్చరించారు.

కోట్లాది రూపాయల స్థిరాస్తి రిజిస్ట్రేషన్లను ఆధార్, పాస్‌పోర్ట్ సేవలతో పోల్చడం సరైంది కాదని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో కేవలం పత్రాల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల రూపకల్పన, భూ యాజమాన్య హక్కులు, ఆస్తుల బదలాయింపు వంటి కీలక ప్రక్రియలు జరుగుతాయి. ఇంతటి ముఖ్యమైన వ్యవహారం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదని ఆయన నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో స్థిరాస్తులు, భూముల విలువలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు శక్తులకు అప్పగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రానురాను భూవివాదాలు పెరుగుతున్నాయని, 22ఏ భూముల సమస్యలు, అడ్డగోలు మ్యూటేషన్లు, డీ-పట్టా భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చడం, కబ్జాలు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని గుర్తు చేశారు. పీపీపీ విధానంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం లాభాపేక్షతోనే పనిచేస్తాయని, ప్రభుత్వ అజమాయిషీ కొరవడుతుందని హెచ్చరించారు.

ఒక కార్పొరేట్ కంపెనీ కడుపు నింపేందుకు లక్ష మంది దస్తావేజు లేఖకులు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వారి కుటుంబాల కడుపు కొట్టడం సరికాదని ఈశ్వరయ్య అన్నారు. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకుని వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని, జీవో నెం.396ను వెంటనే ఉపసంహరించాలని, కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, లోపాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story