సీఐ చినమల్లయ్యా, ఒంటరి మహిళ కనపడితే వదలవా?
x
సీఐ చినమల్లయ్య కోసం కొనసాగుతున్న పోలీసు వేట (ఊహాత్మక చిత్రం)

'సీఐ చినమల్లయ్యా, ఒంటరి మహిళ కనపడితే వదలవా?'

'రసిక శిఖామణి' సీఐ చినమల్లయ్యపై పడింది వేటు! కొనసాగుతున్న వేట


రక్షక భటుడే భక్షకుడిగా మారితే సామాన్యులకు దిక్కెవరు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబలల మానప్రాణాలతో చెలగాటమాడిన పల్నాడు జిల్లా సీఐ బి. చినమల్లయ్య పాపం ఎట్టకేలకు పండింది. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఒంటరి మహిళపై అఘాయిత్యం
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై సీఐ చిన్నమల్లయ్య బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితురాలు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు రాకను గమనించిన చినమల్లయ్య అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
బట్టబయలవుతున్న రాసలీలలు!
అత్యాచార కేసు నమోదు కావడంతో చినమల్లయ్య అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన మరో మహిళతో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. గతంలో వినుకొండలో సీఐగా పనిచేసిన సమయంలో బ్రాహ్మణపల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని ఆయన ఎంతోమంది మహిళలతో రాసలీలలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ స్టేషన్‌కు సమస్యలతో వచ్చే బాధిత మహిళలను లొంగదీసుకుని వారిని ఆ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లేవాడనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్
బి. చినమల్లయ్య కెరీర్ మొదటి నుండి వివాదాలతోనే సాగింది. గతంలో సీఐడీ (CID) విభాగంలో పనిచేసిన సమయంలో, ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.
2024లో కారంపూడిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో, టీ స్టాల్ వద్ద కూర్చున్న టీడీపీ నేత చప్పిడి రాముపై సర్వీస్ రివాల్వర్‌తో బెదిరింపులకు దిగడం అప్పట్లో పెను దుమారం రేపింది. దీనిపై అప్పట్లో నారా లోకేష్ స్పందిస్తూ.. "పోకిరి సినిమా అనుకుంటున్నారా?" అంటూ సీఐ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఇటీవలే కారంపూడికి చెందిన మరో మండల స్థాయి నేతను వాట్సప్‌లో బెదిరింపులకు గురిచేసినట్లు వార్తలు వచ్చాయి.
పరారీలో నిందితుడు
సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో, ప్రస్తుతం పరారీలో ఉన్న చినమల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ నేతృత్వంలో ఫోరెన్సిక్ నిపుణులు గురువారం నాడు నిందితుడి ఇల్లు మరియు బాధితురాలి ఇంటి వద్ద కీలక ఆధారాలు సేకరించారు. బాధితురాలిని చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, 164 సెక్షన్ కింద స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
గతంలో వీఆర్ (VR)లో ఉన్న ఈయన, ప్రస్తుతం ఈ కేసు కారణంగా పూర్తిస్థాయిలో విధులకు దూరమయ్యారు. ప్రజలను కాపాడాల్సిన అధికారి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read More
Next Story