సాయికృష్ణ కేసు ఢమాల్, ఖాకీల పాపానికి ఖద్దరు రక్షణ?
x

సాయికృష్ణ కేసు ఢమాల్, ఖాకీల పాపానికి ఖద్దరు రక్షణ?

సీఐ నాగరాజు సేఫ్, 'ముఖ్యనేత' రాయబారాలు: హైకోర్టు విచారణ వేళ లాయర్ నుంచి ఫైల్స్ తీసుకువెళ్లిన వైనం!


కృష్ణలంక పోలీస్ స్టేషన్ నలుగురు గోడల మధ్య యువకుడు సాయికృష్ణను విచారణ పేరిట చిత్రహింసలు పెట్టి, శవంగా మార్చారనే ఉదంతం ఇప్పుడు ఖాకీల పాపంగా మారితే.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఖద్దరు చొక్కాలు రంగంలోకి దిగాయా?
రేపు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో 'హేబియస్ కార్పస్' పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో.. తెరవెనుక నడిచిన పొలిటికల్ డ్రామా బెజవాడలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
బెజవాడ నగరంలో తీవ్ర దుమారం రేపిన సాయికృష్ణ అదృశ్యం, ఖాకీల కస్టోడియల్ టార్చర్ వ్యవహారం గంటగంటకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు రేపు హైకోర్టులో అత్యంత కీలకమైన 'హేబియస్ కార్పస్ పిటిషన్' విచారణకు రానుండగా.. మరోవైపు ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునే దిశగా తెరవెనుక భారీ వ్యూహం నడిచినట్లు తెలుస్తోంది.
లాయర్ నుంచి ఫైల్స్ తీసుకువెళ్లిన ముఖ్యనేత!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో బాధితుల తరఫున హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఆదిత్య నుంచి కేసు ఫైళ్లను కొందరు ఒత్తిడి తెచ్చి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
స్వర్గీయ వంగవీటి రంగాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ముఖ్య నేత ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయనే సాయికృష్ణ తల్లినీ, పిన్నమ్మను లాయర్ ఆదిత్య వద్దకు తీసుకువెళ్లినట్టు సమాచారం.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆయన పిన్ని లాయర్ కనకదుర్గ స్వయంగా లాయర్ ఆదిత్య వద్దకు వెళ్లి.. కేసు ఫైలును తమకు ఇచ్చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
2026 జూన్ 29న (రేపు) కోర్టు విచారణ జరిగి, పోలీసులు పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉన్న తరుణంలో.. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి బలమైన రాజకీయ ఒత్తిళ్లు లేదా రాయబారాలు జరిగాయా? అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సాయికృష్ణ కేసులో ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని, వారి కుటుంబ సభ్యులను కలిశారు. న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా కూడా ఇచ్చారు.
సిట్ (SIT) రిమాండ్ రిపోర్టులో భయంకర నిజాలు..
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ఈ కేసులోని తీవ్రతను, ఖాకీల అరాచకాన్ని స్పష్టం చేస్తోంది.
మరణంపై అనుమానాలు: థర్డ్ డిగ్రీ, కస్టోడియల్ టార్చర్ తీవ్రత తట్టుకోలేక సాయికృష్ణ చనిపోయి ఉంటాడనే బలమైన అనుమానాన్ని సిట్ తన రిమాండ్ రిపోర్టులో అధికారికంగా వ్యక్తపరిచింది.
అధికారులపై చర్యలు: ఈ అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఘటనలో ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన మరో ముగ్గురు పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేశారు.
తెరవెనుక ఏం జరుగుతోంది?
ఒక సామాన్య యువకుడిని విచారణ పేరిట స్టేషన్‌కు తెచ్చి, ప్రాణాలు పోయేలా చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు నిజమని సిట్ రిపోర్టు ద్వారా ప్రాథమికంగా అర్థమవుతుంటే.. ఇప్పుడు హేబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
సాక్ష్యాల తారుమారుకేనా?: సీఐ అరెస్ట్ అయ్యాక, కేసు మరింత ముదిరితే మరికొందరు ఉన్నతాధికారులు లేదా రాజకీయ నేతల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే ఈ పిటిషన్ విత్‌డ్రా డ్రామా ఆడుతున్నారా?
బాధిత కుటుంబంపై ఒత్తిడి ఉందా?: కంటికి రెప్పలా చూసుకున్న కొడుకు చనిపోయాడని సిట్ చెబుతుంటే.. తల్లి విజయలక్ష్మి కేసు ఫైళ్లను వెనక్కి అడగడం వెనుక స్థానిక ముఖ్యనేత ప్రయోగించిన అస్త్రాలేమిటి? బాధితులను బెదిరించారా లేక మరేదైనా జరిగిందా?
హైకోర్టు వైఖరి ఎలా ఉండబోతోంది?: రేపు పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఒకవేళ బాధితుల తరఫున ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నా, కస్టోడియల్ టార్చర్, మరణం వంటి తీవ్రమైన అంశం ఉన్నందున హైకోర్టు దీనిని 'సుమోటో'గా స్వీకరించి విచారణను కొనసాగిస్తుందా?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ నలుగురు గోడల మధ్య జరిగిన ఈ పాశవిక ఉదంతం బెజవాడ ఖాకీల ప్రతిష్టను మంటగలిపింది. రేపు హైకోర్టు వేదికగా జరగబోయే చట్టపరమైన పోరాటం ఈ కేసును ఏ తీరానికి చేరుస్తుందో.. సాయికృష్ణ తల్లిదండ్రులకు అసలు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
Read More
Next Story