
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆచూకీకి పోలీసుల వేట
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు పూటకో మలుపు తిరుగుతోంది. ఓవైపు ఆయన భార్య ప్రమేయం కూడా ఉందన్న అనుమానంతో పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో ఈ హై-ప్రొఫైల్ క్రైమ్ కేసు చుట్టూ మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
"రాజకీయ అండదండలు.. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్.. రెండేళ్ల నిశ్శబ్దం! కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బెయిల్ రద్దు పిటిషన్.. పోలీసుల మెరుపు సోదాలు.. ప్రస్తుతం ఆయన ఎక్కడ? ఉన్నారనే దానిపై పోలీసులు గాలింపు మొదలు పెట్టినట్టు సమాచారం.
కాకినాడ భానుగుడి సెంటర్‌లోని అనంతబాబు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు నిన్న రాత్రి జరిగిన ఆకస్మిక సోదాలకు దిగారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్తగా కేసు నమోదైంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఆయన పరారైనట్లు తెలుస్తోంది.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఆయన బయట ఉన్నారు. అయితే, సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఆయన్ను గతంలోనే హెచ్చరించింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా, అంతకు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళవారం రాత్రి పోలీసులు అనంతబాబు నివాసానికి వెళ్లినప్పుడు ఆయన కారు, గన్‌మెన్ అక్కడే ఉన్నారు. అయితే, పోలీసుల రాకను ముందే పసిగట్టిన ఆయన మోటార్‌సైకిల్‌పై పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

