
పోలీసుల్లారా.. నా చిలుకమ్మను కనిపెట్టండి ప్లీజ్
సంక్రాంతి సమయంలో పంజరం నుంచి ఎగిరిపోయిన చార్లీ చిలుక.
అది కేవలం పక్షి మాత్రమే కాదు.. ఆ ఇంటి సభ్యురాలు. మాటలు నేర్చిన చిలుకమ్మ ’చార్లీ‘ మాయమవడంతో ఓ వస్త్ర వ్యాపారి ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. సంక్రాంతి సందడిలో తన ప్రియమైన పక్షి పంజరం నుంచి ఎగిరిపోవడంతో, దాన్ని వెతికి పెట్టాలంటూ ఏకంగా పోలీసు గడప తొక్కారు.
ప్రాణం కంటే మిన్నగా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు దొరబాబుకి పక్షులంటే అమితమైన ప్రాణం. మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి రూ. 80 వేలు వెచ్చించి ఒక ప్రత్యేకమైన చిలుకను కొనుగోలు చేశారు. దానికి ’చార్లీ‘ అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజంతా వ్యాపారంలో అలసిపోయి ఇంటికి వచ్చే దొరబాబుకి, తన మాటలను అనుకరిస్తూ పలకరించే చార్లీనే పెద్ద ఉపశమనం.
పండుగ పూట ’చార్లీ‘ జంప్
సంక్రాంతి సంబరాల్లో ఇంటి సభ్యులంతా బిజీగా ఉండగా.. పంజరం తలుపు కాస్త తెరుచుకోవడంతో చార్లీ ఆకాశంలోకి తుర్రుమంది. అప్పటి నుంచి దొరబాబు కుటుంబం ఆందోళనలో పడిపోయింది. ఊరంతా గాలించగా, అదే గ్రామంలోని ఒకరి ఇంటి వద్ద చార్లీ వాలినట్లు సమాచారం అందింది.
చిక్కుల్లో చిలుకమ్మ.. పోలీసులకు ఫిర్యాదు
చార్లీని బంధించిన వారి వద్దకు వెళ్లి, తన పక్షిని తనకు ఇచ్చేయమని దొరబాబు ప్రాధేయపడ్డారు. కావాలంటే కొంత నగదు బహుమతిగా ఇస్తానని ఆశ చూపినా ఫలితం లేకపోయింది. చూశాం కానీ ఎగిరిపోయింది అంటూ వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో దొరబాబుకి అనుమానం వచ్చింది. తన చిలుకను వారే దాచి ఉంచారని భావిస్తూ, చేసేదేమీ లేక కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

