చంద్రబాబు పాలనలో ’విషపు గింజలు‘
x

చంద్రబాబు పాలనలో ’విషపు గింజలు‘

మందా సాల్మన్‌ హత్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జగన్, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటూ సీఎం చంద్రబాబును హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని, చంద్రబాబు నాయుడు తన పాలనలో విషపు గింజలు నాటుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో టీడీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన దళిత కార్యకర్త మందా సాల్మన్‌ ఉదంతంపై జగన్ గురువారం మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.

సొంత ఊరికి వెళ్లడమే సాల్మన్ చేసిన పాపమా

సాల్మన్ ఒక సామాన్య దళితుడు. తన భార్య అనారోగ్యం బారిన పడిందని పలకరించేందుకు సొంత గ్రామం పిన్నెల్లికి వెళ్తే.. అతడిని రాడ్లతో కొట్టి కిరాతకంగా చంపేశారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, మనిషి చనిపోయాక కనీసం మృతదేహాన్ని కూడా ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం చంద్రబాబు మార్కు అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు. తన పార్టీ నేతలు పోరాడితే తప్ప అంత్యక్రియలకు అనుమతి లభించలేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని జగన్ పేర్కొన్నారు.

రెడ్‌బుక్ రాజ్యాంగం.. కోర్టు మెట్లు ఎక్కుతున్న గ్రామాలు

రాష్ట్రంలో రాజ్యాంగ పాలన అంతరించిందని, చంద్రబాబు దగ్గరుండి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రోత్సహిస్తున్నారని జగన్ విమర్శించారు. సొంత ఊరిలో అడుగుపెట్టడానికి కూడా ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జనం ఊర్లు విడిచి పారిపోయే పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం సమాజంలో చెడ్డ అలవాట్లు, కక్షసాధింపు ధోరణిని ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు కూడా దోషే.. ఎల్లకాలం మీరే ఉండరు

మందా సాల్మన్ హత్య ఘటనలో కేవలం దాడి చేసిన వారే కాకుండా.. అడ్డుకోలేకపోయిన సీఐ, ఎస్సై, ఎస్పీ నుంచి స్థానిక ఎమ్మెల్యే , ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరూ దోషులేనని జగన్ అభివర్ణించారు. అధికార గర్వంతో ఊగిపోతున్న వారికి హెచ్చరిక జారీ చేస్తూ.. చంద్రబాబూ గుర్తు పెట్టుకో.. నీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. నువ్వు నాటిన విషపు గింజల ఫలితాన్ని రేపు నువ్వు కూడా అనుభవించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.

న్యాయపోరాటానికి సిద్ధం

పిన్నెల్లి ఉదంతాన్ని అంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని, ఈ విషయంలో కోర్టులను, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (NHRC) ఆశ్రయించబోతున్నట్లు జగన్ ప్రకటించారు.

Read More
Next Story