
ఏటుకూరి ప్రసాద్
నేలకొరిగిన సాహితీ శిఖరం ఏటుకూరి ప్రసాద్!
ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత, విమర్శకులు, అక్షర శ్రామికుడు, 'నవచేతన' పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ కన్నుమూశారు.
తెలుగు సాహిత్య విమర్శలో, ప్రగతిశీల ప్రచురణ, పత్రికా రంగంలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ 9 పదుల వయసులో తుదిశ్వాస విడిచారనే వార్త అక్షర లోకాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత, విమర్శకులు, అక్షర శ్రామికుడు, 'నవచేతన' పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ శనివారం రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు.
సమాజ మార్పు కోసం, పీడిత ప్రజల పక్షాన కలమెత్తి దశాబ్దాల పాటు సాగిన ఒక గొప్ప మేధావి సాహితీ ప్రయాణం ఆగిపోయింది. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి, ముఖ్యంగా అభ్యుదయ, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు.
గుంటూరు నుంచి హైదరాబాద్ దాకా..
1936లో గుంటూరు జిల్లాలో జన్మించిన ఏటుకూరి ప్రసాద్ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాల పట్ల ఆకర్షితులయ్యారు. నాటి నుంచే యువజన, అభ్యుదయ పత్రికలకు సంపాదకులుగా వ్యవహరిస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. వృత్తిరీత్యా దాదాపు 34 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా సేవలందించి, ఎంతోమంది విద్యార్థులను ప్రగతిశీల భావాల వైపు నడిపించారు. ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని నిరంతరం సాహిత్య వేదికలపై చురుగ్గా కనిపిస్తూ, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అగ్రగామిగా సంస్థను నడిపించారు.
నవచేతనకు ఊపిరిగా, విశిష్ట విమర్శకుడిగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కూడా రెండుగా విడిపోయింది. నవచేతన, విశాలాంధ్రగా రెండు ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి. ఆయన నవచేతన ప్రచురణానికి సంపాదకుడు అయ్యారు.
పుస్తక ప్రచురణ రంగంలో ‘విశాలాంధ్ర’ ప్రచురణాలయానికి తెలుగునాట ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. దానికి సంపాదకులుగా వ్యవహరిస్తూ, సమాజానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన గ్రంథాలను, అనువాదాలను, రాజకీయ, సామాజిక విశ్లేషణలను పాఠకులకు అందించడంలో ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. కొత్త రచయితలను ప్రోత్సహించడంలో ఆయన ఎడిటోరియల్ విజన్ ఎంతో గొప్పది.
సాహిత్య విమర్శకుడిగా ఆయన రాసిన "తాపీ ధర్మారావు జీవితం - రచనలు" పరిశోధనా గ్రంథం తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. సాహిత్యానికి, సామాజిక బాధ్యతకు విడదీయరాని బంధం ఉందని నమ్మిన ఆయన రచనలు సాధారణంగా సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, గ్రామీణ జీవితం, ఆత్మాన్వేషణ చుట్టూ తిరుగుతాయి. ఆయన భాష ఎంతో సరళంగా, భావం సూటిగా ఉండి సామాన్య పాఠకుడిని సైతం ఆలోచింపజేసేది.
‘పొయిట్రీ వర్క్ షాప్’ ప్రయోగం
ఏటుకూరి ప్రసాద్ లోని అద్భుతమైన పరిశోధనా దృష్టికి, సృజనాత్మకతకు నిదర్శనం ఆయన తెచ్చిన ”పొయిట్రీ వర్క్ షాప్” (1993) కవితా సంకలనం. నేడు కంప్యూటర్లు వచ్చినా ఆయన మాత్రం కాగితం, కలాన్నే వాడేవారు. కాగితంపై రాసేటప్పుడు కొట్టివేతలు, మార్పులు, చేర్పులతో కూడిన ‘చిత్తుప్రతులు’ సహజం. అన్నీ పూర్తయ్యాక శుద్ధ ప్రతిని అచ్చుకిచ్చి, చిత్తుప్రతులను పారేయడం ఆనవాయితీ.
కానీ, చిత్తు ప్రతి అనేది కవి మనసులో తొలిసారి రేగిన భావ తుంపరకు, సృజనాత్మక ఘర్షణకు సజీవ సాక్ష్యం. దిద్దుబాట్లతో వడబోసిన శుద్ధ ప్రతి కంటే, చిత్తు ప్రతుల్లోనే కవి ఆరాటం కనిపిస్తుంది. మన పెద్దలు కొందరు వాటి విలువ తెలిసి భద్రపరచడం వల్లనే తెలుగులో కొన్ని చేతిరాతల ప్రతులు దొరికాయి.
ఈ నేపథ్యంలో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ అకుంఠిత కృషి ఫలితంగా శతాధిక (నూరు మందికి పైగా) తెలుగు కవుల చేతిరాతల కవితలతో ‘పొయిట్రీ వర్క్ షాప్’ సంకలనం వెలువడింది. ఈ తరహాలో అచ్చయిన కవితా సంకలనం తెలుగులో బహుశా ఇదే మొదటిది. ముఖ్యంగా ఈ పుస్తకానికి ఏటుకూరి వారు రాసిన ‘కీ నోట్’ (ముందుమాట) సాహిత్య చరిత్రలో ఎంతో విలువైనదిగా నిలిచింది.
1934లో ‘చంద్రిక’ మాసపత్రిక సంపాదకులు దోమా వెంకటస్వామి, బులుసు వేంకటరమణయ్యలు ‘హస్తాక్షరి.. ముద్రాక్షరి’ పేరిట తెలుగు కవుల సంతకాలను ముద్రించారు.
1970లో నిజామాబాద్‌కు చెందిన ‘ఇందూరు భారతి’ కవులు “సైబ” పేరుతో చేతిరాతల కవితలను సైక్లోస్టైల్డ్ సంకలనంగా తెచ్చారు. ఆ తర్వాత శీలా వీర్రాజు గారి “కిటికీ కన్ను” (1980), శ్రీశ్రీ “మహాప్రస్థానం” (1981), అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటులు వంటి వ్యక్తిగత చేతిరాతల పుస్తకాలు వచ్చాయి. ఇంతమంది కవుల చేతిరాతలను ఒకే చోటికి చేర్చి సంకలనంగా తేవడం ప్రసాద్ సంపాదకీయ ప్రతిభకు మచ్చుతునక. ముద్రణా అక్షరాల్లో కంటే కవుల స్వహస్తాలతో రాసిన కవితలను చూడటంలో, చదవడంలో ఉండే అనుభూతి, ‘కిక్కే’ వేరని ఆయన నిరూపించారు. నేటి తరం కవిసంగమం వంటి సాహిత్య వేదికలు కూడా స్పూర్తి పొంది ఇలాంటి చేతిరాతల సంకలనాలు మరిన్ని తీసుకురావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం.
అక్షరాన్ని నమ్ముకుని, అక్షరమే శ్వాసగా బతికిన ఈ నిబద్ధత గల సంపాదకుడిని కోల్పోవడం తెలుగు సమాజానికి పూడ్చలేని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సాహిత్యం, నవచేతన ద్వారా ఆయన ముద్రించిన వేలాది పుస్తకాలు నిరంతరం తెలుగు పాఠకులను చైతన్యపరుస్తూనే ఉంటాయి.
అంతిమయాత్ర వివరాలు...
ఏటుకూరి ప్రసాద్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ఇవాళ (ఆదివారం - 24.05.2026) హైదరాబాద్‌లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు హిమాయత్‌నగర్‌లోని ఆయన స్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాహిత్య, పత్రికా, రాజకీయ రంగాల ప్రముఖులు ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు.
తెలుగు సాహిత్య లోకానికి దిక్సూచిగా నిలిచిన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ వినమ్ర అశ్రు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి.
అరసం సంతాపం...
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆంధ్రప్రదేశ్ శాఖ డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలు ఆయనకు నివాళి అర్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. సంఘం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ వల్లూరి శివప్రసాద్, కొమ్మాలపాటి శరత్‌చంద్ర జ్యోతిశ్రీ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story

