
మోదీ కాళ్లు మొక్కిన ఈ 98 ఏళ్ల ‘బెంగాల్ బీజ’ ఎవరు?
సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో ఓ విస్మయకర సన్నివేశం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించిన రోజు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో ఓ విస్మయకర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక వృద్ధుడి పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వృద్ధుడు మరెవరో కాదు- బీజేపీ సీనియర్ నేత మఖన్‌లాల్ సర్కార్. ఆయన వయసు 98 ఏళ్లు.
ఎవరీ మఖన్‌లాల్ సర్కార్?
ఆయన బెంగాల్ బీజేపీకి జీవం పోసిన వారు. స్వాతంత్ర్య సమర యోధుడు. 1952లో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్‌లో భారత జెండా ఎగురవేయాలని ఉద్యమించి జైలు పాలైన వ్యక్తి.
1980లో బీజేపీ ఏర్పాటైన వెంటనే పశ్చిమ దినాజ్‌పుర్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాల్లో సంస్థాగత కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 10,000 మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చారు. 1981 నుంచి వరుసగా 7 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. బెంగాల్‌లో బీజేపీ ఇప్పటి వరకు కేవలం ఒక చిన్న పార్టీగా ఉన్న రోజుల్లోనే, ఆయన వంటి నాయకులు గడ్డపై ఎన్నో కష్టాలు, బెదిరింపులు ఎదుర్కొని పార్టీని నిలబెట్టారు.
ఎందుకు మోదీ కాళ్లు మొక్కారు?
ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు. ఇది చరిత్ర పట్ల, త్యాగం పట్ల, సంప్రదాయం పట్ల ఉన్న గౌరవం. ప్రధాని మోదీ తన స్వభావానికి తగ్గట్టుగానే, ఆ పెద్దాయనకు శాలువా కప్పి, పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సన్నివేశం వేదికపై ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది. నెటిజన్లు “ఇదే సంస్కృతి”, “ఇదే భారతీయత” అంటూ పోస్టులు చేస్తున్నారు.
98 ఏళ్ల వయసులో కూడా బెంగాల్ బీజేపీ చరిత్ర సాక్షిగా నిలిచిన మఖన్‌లాల్ సర్కార్‌కు ఈ గౌరవం దక్కడం- బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఐతిహాసిక రోజున చాలా అర్థవంతంగా కనిపించింది.
Next Story

