ఉద్యోగుల 29 డిమాండ్ల కోసం దశలవారీ ఉద్యమం
x
సదస్సులో పాల్గొని మాట్లాడుతున్న ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగుల 29 డిమాండ్ల కోసం దశలవారీ ఉద్యమం

పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్, పెండింగ్ డీఏలు, బకాయిలు పే స్లిప్‌లో చూపించాలని డిమాండ్


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న అలక్ష్యాన్ని విడనాడి పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, బకాయిలు ప్రతి ఉద్యోగి పే స్లిప్‌లో చూపించాలని డిమాండ్ చేస్తూ ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ దశలవారీ ఉద్యమ కార్యాచరణను శుక్రవారం ప్రకటించింది.

రాఘవయ్య పార్కు వద్ద మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పలుమార్లు వినతిపత్రాలు, చర్చలు జరిపినా నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఉద్యమం తప్పదని అన్నారు. గతంలో 11వ పీఆర్సీని కూడా ‘ఛలో విజయవాడ’ లాంటి పోరాటాలతో సాధించుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లా నాయకత్వ అభిప్రాయాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, గత ప్రభుత్వం నుంచి నేటి వరకు 40 వేల కోట్లు పైబడి పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవులు, రిటైర్డు ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అదనపు పెన్షన్ క్వాంటం వంటి న్యాయమైన ప్రయోజనాలే కోరుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలే ఉద్యమ లక్ష్యమని రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు అన్నారు. ఉద్యమం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

ఉద్యమ కమిటీ చైర్మన్ టి.వి. ఫణి పేర్రాజు మాట్లాడుతూ, ఉద్యోగులు కోరిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆర్థిక సమస్యల పరిష్కారంలో జాప్యం వల్ల ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని అన్నారు. 28 జిల్లాల చైర్మన్ల అభిప్రాయాల మేరకు ప్రధాన డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.


ఉద్యమ కార్యాచరణ

మొదటి దశ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11)

ఆగస్టు 31న జిల్లా కలెక్టర్లకు నోటీసులు, సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్ ప్రారంభమవుతుందని తెలియజేయడం. సెప్టెంబర్ 1న ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో సెల్‌ఫోన్ డీపీ మార్పు. సెప్టెంబర్ 1-5 నల్ల బ్యాడ్జీలు. సెప్టెంబర్ 2-8 హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం. సెప్టెంబర్ 3-5 లంచ్ అవర్ నిరసనలు. సెప్టెంబర్ 11న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు.

రెండో దశ (సెప్టెంబర్ 15 నుంచి 26)

సెప్టెంబర్ 15-26 వర్క్ టు రూల్ (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు మాత్రమే). సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు. సెప్టెంబర్ 17న ప్రధాన కూడళ్లలో నల్ల కండువాలు, మానవహారం. సెప్టెంబర్ 23, 26న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద 26న కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమాల నిర్వహణ.

మూడో దశలో మల్టీజోన్ సదస్సులు, సహాయనిరాకరణ, రిలే నిరాహార దీక్షలు, ఛలో విజయవాడ, నిరవధిక సమ్మె వంటి ఉదృత కార్యాచరణను రెండో దశలో ప్రకటిస్తామని తెలిపారు.

ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 45 వేల కోట్లు చెల్లించాలని, అన్ని పోరాటాల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

సదస్సు ముగిసిన వెంటనే చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు.

Read More
Next Story