
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
పశ్చిమాసియాలొ ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపై కొంత భారం మోపాయి. దీంతో శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.3 వరకు పెరిగాయి.
కొత్త ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కు చేరగా, డీజిల్ ధర రూ.90.67గా నమోదైంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా ధరలు పెరిగాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర సగటున 69 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది 113 నుంచి 114 డాలర్ల వరకు చేరినట్లు సమాచారం.
ఈ ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంపైనా పడింది. అయితే పూర్తి భారం వినియోగదారులపై వేయకుండా, అందులో కొంత భాగాన్ని మాత్రమే ప్రస్తుతం పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం గత కొంతకాలంగా ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా, దేశీయ వినియోగదారులను రక్షించేందుకు 2022 ఏప్రిల్ నుంచి రోజువారీ ధరల సవరణను ఈ సంస్థలు నిలిపివేశాయి.
అయితే ఆ సమయంలో చమురు కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. తర్వాత కొంతకాలం అంతర్జాతీయ ధరలు తగ్గడంతో ఆ నష్టాలు కొంత మేర తగ్గాయి.
ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. అప్పటి నుంచి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పెంపు చోటుచేసుకుంది.
తాజా ధరల ప్రకారం పెట్రోల్ ధరలు లీటరుకు..
ఢిల్లీలో – రూ.97.77
కోల్‌కతా – రూ.108.74
ముంబై – రూ.106.68
చెన్నై – రూ.103.67
డీజిల్ ధరలు..
ఢిల్లీలో – రూ.90.67
కోల్‌కతా – రూ.95.13
ముంబై – రూ.93.14
చెన్నై – రూ.95.25
ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

