
ఆంధ్రాని పెట్రోల్-డీజిల్ భయం పట్టుకుంది...
శనివారం ఒక్కరోజు సాధారణ కొనుగోలు కంటే పెట్రోల్, డీజిల్ 50 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయి.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరత నేపథ్యంలో ప్యానిక్ కొనుగోళ్లు తీవ్ర రూపం తీసుకున్నాయి. దీంతో 4,510 పెట్రోల్ బంకుల్లో 421 బంకులు మూతపడ్డాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా, భయం కారణంగా కొనుగోళ్లు భారీగా పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయి.
ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటే, శనివారం ఒక్కరోజే 10,345 కి.లీ. పెట్రోల్, 14,156 కి.లీ. డీజిల్ అమ్ముడయ్యాయి. అంటే సాధారణ అమ్మకాల కంటే ఒక్కసారిగా 50 శాతం పెరిగాయి.
డీజిల్ కోసం బందరు రోడ్డులోని పోలీస్ పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై బారులు తీరిన కార్లు
ప్యానిక్ కొనుగోళ్ల వాస్తవం
అధికారుల విశ్లేషణ ప్రకారం, కొరత ఉందనే ఆందోళనతో ప్రజలు అనవసరంగా ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో సరఫరా సామర్థ్యం ఉన్నా బంకుల వద్ద రద్దీ, బారులు తీరుతున్నాయి. కొరత వస్తుందేమో ననే ప్రజల భయం కారణంగా నిజంగానే కొరత తలెత్తుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు డ్రమ్‌లలో భారీగా కొనుగోళ్లు చేయడం వల్ల సాధారణ వినియోగదారులకు మరింత ఇబ్బంది కలుగుతోంది.
సీఎం చంద్రబాబు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఆక్వా రంగంలో డ్రమ్ కొనుగోళ్లపై ప్రత్యేక నియంత్రణ విధించాలని, ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారం పై సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి అసంతృప్తి
కొరత భయం కొద్ది రోజులు గా కొనసాగుతున్నా సకాలంలో చర్యలు తీసుకోవడంలో, సరఫరాలను సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలమైనందుకు చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యాక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను, చమురు కంపెనీలను ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ ప్రయత్నానికైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా కంపెనీలకు మంజూరు చేసిన అనుమతులను పునఃసమీక్షిస్తామని హెచ్చరించారు.
నిరంతరాయంగా సరఫరా సాగేలాచూడాలని, యుద్ధ ప్రాతిపదికన అన్ని పెట్రోల్ బంకులలో నిల్వలను తిరిగి నింపాలని ముఖ్యమంత్రి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, ఇంధన డీలర్లతో సమన్వయం చేసుకుని, సరఫరా, డిమాండ్‌పై సవివరమైన నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం సరఫరా లైన్‌లు సాధారణ స్థాయికి చేరుకుంటున్నప్పటికీ, ప్యానిక్ కొనుగోళ్లు కొనసాగితే మరిన్ని బంకులు మూసివేయవలసి వచ్చే ప్రమాదం ఉంది. ఇది రవాణా, వ్యవసాయం, చేపల పరిశ్రమతో పాటు సాధారణ ప్రజల రోజువారీ జీవనం మీద కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం సరఫరా పెంచడంతో పాటు, ప్రజల్లో అనవసర ఆందోళన తొలగించేందుకు సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం త్వరిత చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజల సహకారం లేకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్ర రూపం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం సవాలుతో ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఎంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుందనేది అధికారుల చర్యలు, ప్రజల సహకారంపై ఆధారపడి ఉంది.

