జర్నలిస్ట్ ల నిర్భంధంపై సుప్రీం లో పిటిషన్
x

జర్నలిస్ట్ ల నిర్భంధంపై సుప్రీం లో పిటిషన్

సీజేపీ, ఇండి కూటమి నిరసనల సందర్భంగా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపణ


ఒకవైపు జర్నలిస్టులు తమ విధులు నిర్వహిస్తుంటే.. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరాయి. ఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల నిర్బంధంపై ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ (FSC) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. బాధ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరింది.

అక్టోబర్ 11న ఎన్నికల ప్రధాన కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరిగిన నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన 20 మందికి పైగా జర్నలిస్టులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు FSC తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రెస్ గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి, గంటల తరబడి నిర్బంధించినట్లు ఆరోపించింది. ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్, కన్నాట్ ప్లేస్ సహా పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు తెలిపింది.

అయితే, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇతర వృత్తి నిపుణులు తమ విధులు నిర్వహించకుండా అడ్డుకోకూడదని అదే రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పిటిషన్‌లో గుర్తుచేశారు. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ పోలీసులు జర్నలిస్టులను నిర్బంధించారని FSC ఆరోపించింది.

నిర్బంధానికి గురైన వారిలో ది న్యూస్ మినిట్‌కు చెందిన నిధి సురేశ్‌తో పాటు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హిందీ విభాగానికి చెందిన శాశ్వత్, సియా, విజయ్ ఉన్నట్లు పిటిషన్‌లో వివరించారు. నిధి సురేశ్‌ను సాయంత్రం సుమారు 6.30 గంటలకు విడుదల చేయగా, ఇతర జర్నలిస్టులను కన్నాట్ ప్లేస్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పరంజోయ్ గుహా ఠాకుర్తా ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించినట్లు కూడా ఆరోపించారు.

ఈ ఘటనలకు బాధ్యులైన పోలీసు అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని FSC కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసులకు ఎలా చేరవేశారో వివరించాలని, ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, నిర్బంధ రికార్డులను భద్రపరచాలని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు, జర్నలిస్టులపై దాడులు, విధులకు ఆటంకాలు కలిగించారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు రాజ్యాంగం కల్పించిన ఇతర ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు.

ఇదే అంశంపై నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిరసనలు, బహిరంగ కార్యక్రమాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపై దాడులు, అక్రమ నిర్బంధాలు జరిగాయన్న ఆరోపణలను ప్రస్తావించింది. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు, మీడియా వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది.

జర్నలిస్టుల నిర్బంధంపై దాఖలైన ఈ పిటిషన్లు.. మీడియా స్వేచ్ఛ, పోలీసుల విధి నిర్వహణ, న్యాయస్థానాల ఆదేశాల అమలు వంటి అంశాలను మరోసారి చర్చలోకి తెచ్చాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తదుపరి తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.

Read More
Next Story