
పన్నులు కడితే హక్కులు రావట
ప్రభుత్వ భూములపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
ప్రభుత్వ భూములే కదా.. ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం.. పన్నులు కూడా కడుతున్నాం.. ఇక ఈ భూమి మాదే అని ధీమాగా ఉన్న ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. దశాబ్దాల నివాసం ఉన్నంత మాత్రాన, మీది కాని భూమిపై మీకు యజమాని హోదా రాదని జస్టిస్ నూనెపల్లి హరినాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. చట్టబద్ధమైన పత్రాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసిన వారు.. వారు ఎన్ని తరాలుగా అక్కడే ఉన్నా సరే, చట్టం దృష్టిలో కేవలం ఆక్రమణదారులు మాత్రమేనని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ భూములపై హక్కుల విషయంలో ఉన్న అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
చాలామంది తాము దశాబ్దాలుగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, తమకు విద్యుత్, మున్సిపల్ నీటి కనెక్షన్లు ఉన్నాయని, కాబట్టి ఆ భూమిపై తమకు హక్కు ఉంటుందని భావిస్తుంటారు. అయితే, వీటిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేవలం పన్నులు కట్టినంత మాత్రాన లేదా ప్రభుత్వ సౌకర్యాలు పొందినంత మాత్రాన ఆ భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూమి కాలువ లేదా శ్మశాన వాటిక వంటి అవసరాల కోసం ఉంటే, దానిని ఆక్రమించిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ యజమాని హోదా దక్కదని తీర్పునిచ్చింది.
2013 చట్టం.. పరిహారానికి నో ఛాన్స్
2013 భూసేకరణ చట్టం కింద భారీ పరిహారం ఆశిస్తున్న ఆక్రమణదారులకు ఈ తీర్పు ఒక పెద్ద షాక్. కేవలం భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ యాజమాన్య పత్రాలు ఉన్నవారు మాత్రమే ఈ చట్టం కింద పరిహారానికి అర్హులని కోర్టు వివరించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నివసించే వారు భూ యజమానులు అనే నిర్వచన పరిధిలోకి రారని, అందువల్ల వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
మానవతా దృక్పథం వేరు.. చట్టం వేరు
విజయవాడ గుణదల ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థలాలను ఖాళీ చేయించిన నేపథ్యంలో బాధితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. బాధితులు తాము భూమి లేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నప్పటికీ.. చట్టం ముందు ఆక్రమణ ఆక్రమణే అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వం వారికి మానవతా దృక్పథంతో ఇప్పటికే 114 ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేస్తూ, అంతకుమించి పరిహారం కోరడం సమంజసం కాదని పేర్కొంది. ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో, కాలువ గట్లపై ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారు భవిష్యత్తులో భూసేకరణ సమయంలో నగదు పరిహారం ఆశించడానికి అవకాశం లేకుండా పోయింది.

