
ఈ ఏడాది పవన్ కల్యాణ్ సినిమాలు లేనట్లే...
పవన్ కల్యాణ్ భుజానికి ఆపరేషన్ చేయడం వల్ల రెస్ట్ లో ఉండాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేళ్లుగా బాధపడుతున్న భుజం గాయానికి శస్త్రచికిత్స జరిగింది. 2016లో సినిమా సెట్‌లో ఏర్పడిన గాయం, పోరాట యాత్ర, వరాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో రైతులు, అభిమానులు చేతులు పట్టుకోవడంతో మరింత తీవ్రమైంది. దీనికి సక్సెస్‌ఫుల్ సర్జరీతో పరిష్కారం వచ్చింది.
ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్‌లో జూలై 11 (శనివారం) రైట్ షోల్డర్ రోటేటర్ కఫ్ టియర్, అవల్షన్ ఫ్రాక్చర్‌ను ప్రముఖ ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్‌షా పార్దివాలా నేతృత్వంలోని బృందం మూడున్నర గంటల పాటు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేసి సరిచేసింది. సర్జరీ అత్యంత విజయవంతంగా ముగిసినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.
వైద్యుల సలహా మేరకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత ఫిజియోథెరపీతో నాలుగు నెలల్లో పూర్తి కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లెఫ్ట్ షోల్డర్ సర్జరీ కూడా రెండు నెలల్లో జరగనుంది. ఈ కారణంగా ఈ ఏడాది సినిమాలు తీసే అవకాశం లేదని సమాచారం.
సీఎం చంద్రబాబు సందర్శన
సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలోని హాస్పిటల్‌కు వ్యక్తిగతంగా వెళ్లి పవన్ కల్యాణ్ ఆరోగ్యం విచారించారు. ట్విట్టర్ (X)లో ఆయన “త్వరగా కోలుకొని మరింత ఉత్సాహంగా తిరిగి రావాలి” అని శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కూడా ముంబైలో క్యూ కట్టి పవన్ కల్యాణ్ ఆరోగ్య స్థితిని అడిగి వచ్చారు.

