
అమెరికా ట్రేడ్ పోస్ట్‌లో ఇండియా మ్యాప్ వివాదం..
పాక్ అభ్యంతరం తెలపడంతో తొలగింపు..
అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆ పోస్ట్‌లో జమ్మూ–కాశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగంగా చూపిన మ్యాప్ ఉండటం పాకిస్తాన్‌కు అభ్యంతరకరంగా మారింది. దీనిపై ఇస్లామాబాద్ వెంటనే వాషింగ్టన్‌ను సంప్రదించింది. ఆ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), చైనా క్లెయిమ్ చేసే అక్సాయ్ చిన్ ప్రాంతాలను కూడా భారత భూభాగంగా చూపించారు. ఇది అమెరికా గతంలో అనుసరించిన విధానానికి భిన్నంగా ఉందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి (UN) ఆమోదించిన మ్యాప్ ప్రకారం జమ్మూ–కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని వారు గుర్తుచేశారు.
పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. “మేము అమెరికా అధికారులతో మాట్లాడాం. వారు తప్పు గుర్తించి అవసరమైన మార్పులు చేశారు” అని తెలిపారు. ఈ చర్యతో పాకిస్తాన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ వివాదం అమెరికా–భారత్ వాణిజ్య చట్ర ఒప్పంద వివరాల విడుదల సమయంలో వెలుగులోకి వచ్చింది. సుంకాల తగ్గింపు అంశాలతో పాటు విడుదలైన పోస్టులో ఈ మ్యాప్ కనిపించింది. వివాదం తలెత్తడంతో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆ పోస్టును తరువాత తొలగించింది.

