ఎర్రకోట పేలుడు వెనుక జైష్-ఎ-మొహమ్మద్ హస్తం
x

ఎర్రకోట పేలుడు వెనుక జైష్-ఎ-మొహమ్మద్ హస్తం

ఐక్యరాజ్యసమితి ప్యానెల్ నివేదిక వెల్లడి


Click the Play button to hear this message in audio format

న్యూఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో గత నవంబర్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)కు సంబంధం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల పర్యవేక్షణ బృందం తాజా నివేదికలో పేర్కొంది. ఈ దాడిలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

ISIL, అల్-ఖైదాకు సంబంధించి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీకి సమర్పించిన విశ్లేషణాత్మక మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం 37వ నివేదికలో.. ఒక సభ్య దేశం జైష్-ఎ-మొహమ్మద్ వరుస దాడులకు బాధ్యత వహించిందని గుర్తించినట్లు వెల్లడించింది. నవంబర్ 9న న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దాడితో ఈ సంస్థకు సంబంధం ఉన్నట్లు నివేదించారు.

నివేదిక ప్రకారం.. అక్టోబర్ 8న జెఎం నాయకుడు మహ్మద్ మసూద్ అజార్ అల్వి ఉగ్రదాడులకు మద్దతు అందించేందుకు “జమాత్ ఉల్-ముమినాత్” పేరుతో మహిళలకు మాత్రమే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మరో సభ్య దేశం జైష్-ఎ-మొహమ్మద్ ప్రస్తుతం చురుకుగా లేదని నివేదించినప్పటికీ, జులై 28న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు మరణించారని కూడా విడిగా నివేదించినట్లు తెలిపింది.

ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారును లక్ష్యంగా చేసుకుని జరిగిన పేలుడు అత్యంత తీవ్రతతో సాగిందని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని నివేదికలో పేర్కొన్నారు.

ఈ నివేదికపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, “ఈ నివేదిక పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంది. ఇది విశ్లేషణాత్మక మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం 37వ నివేదిక. ఫిబ్రవరి 4, 2026న ప్రచురితమైంది” అని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం వ్యక్తం చేసిన ఆందోళనలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారని, ఉగ్రవాద వ్యతిరేక గ్లోబల్ పోరాటాన్ని బలోపేతం చేసే అంశాలపై కూడా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, భారత ఉపఖండంలో అల్-ఖైదా (AQIS) ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లో చురుకుగా ఉందని, అక్కడ హక్కానీ నెట్‌వర్క్ ప్రభావం గణనీయంగా ఉందని నివేదిక వెల్లడించింది. AQIS ఎమిర్ ఒసామా మహమూద్, ఉపనాయకుడు యాహ్యా ఘౌరి కాబూల్‌లో ఉన్నారని, మీడియా విభాగం హెరాత్‌లో పనిచేస్తోందని తెలిపింది. AQIS బాహ్య కార్యకలాపాలపై దృష్టి సారిస్తోందనే ఆందోళనలు ఉన్నాయని కూడా పేర్కొంది.

ISIL-K ప్రధానంగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో, ముఖ్యంగా బడాఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో చురుకుగా ఉందని నివేదిక వెల్లడించింది. మధ్య ఆసియా భాషలలో దూకుడు ప్రచారం ద్వారా తన లక్ష్య వర్గాన్ని విస్తరించుకుంటోందని, గాజా–ఇజ్రాయెల్ వివాదం వంటి అంశాలను నియామకాలు, నిధుల సమీకరణకు వినియోగించుకుంటోందని కూడా నివేదిక హెచ్చరించింది.

Read More
Next Story