ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై వేధింపులను ఖండించిన OPDR తెలంగాణ
x

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై వేధింపులను ఖండించిన OPDR తెలంగాణ

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల నిఘాపైనా ఆందోళన


ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని OPDR (ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్) తెలంగాణ తీవ్రంగా ఖండించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ ప్రభుత్వాలు నిర్బంధ ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆ సంస్థ ఆరోపించింది.

గత కొద్దిరోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన రాజకీయ విశ్లేషణలపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోందని OPDR పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అధికార-ప్రతిపక్ష పార్టీల సంబంధాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులపై ఆయన తనకు అందిన సమాచారం మేరకు రాజకీయ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. రాజకీయ విశ్లేషణ చేయడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం ప్రతి పౌరుడికీ రాజ్యాంగబద్ధ హక్కు అని స్పష్టం చేసింది.

అయితే, ఆయన వ్యాఖ్యలు అధికార కూటమికి నచ్చకపోవడంతో ప్రభుత్వం తీవ్ర నిర్బంధ చర్యలకు దిగిందని విమర్శించింది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకోవడం సాధారణమేనని, అలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ విశ్లేషకుడు తన అభిప్రాయాలు వెల్లడిస్తే దానిపై ఇంత పెద్ద స్థాయిలో వివాదం సృష్టించడం అధికార పక్షం అసహనానికి నిదర్శనమని పేర్కొంది.

ఇప్పటికే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తోందని OPDR ఆరోపించింది. కోర్టులు కూడా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తపరచడం నేరం కాదని పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను ఉపయోగించి విమర్శకులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆయనపై తీవ్రమైన నేరారోపణలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం అనైతికమని OPDR పేర్కొంది.

అలాగే, నాగేశ్వర్‌కు మద్దతుగా మాట్లాడిన ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులపై కూడా నిఘా పెట్టడం ఆందోళనకరమని తెలిపింది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఇంటి వద్దకు పోలీసులు వెళ్లడాన్ని OPDR తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంది.

తెలంగాణ పోలీసులు కూడా ఈ అణచివేత చర్యల్లో భాగమవుతున్నట్లు వార్తలు రావడం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుమ్మక్కును సూచిస్తోందని ఆరోపించింది. ప్రజాస్వామ్యవాదుల గొంతుకలను అణచివేయడానికి ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించింది.

రోజురోజుకీ ప్రజల హక్కులు హరించబడుతున్నాయని, కనీస వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా ప్రభుత్వాలు సహించలేని పరిస్థితి నెలకొందని OPDR ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్న ఈ సమయంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పౌరసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

Read More
Next Story