అమరావతి కోసం రైతుల భూములపై మళ్లీ ‘బలవంతం’
x

అమరావతి కోసం రైతుల భూములపై మళ్లీ ‘బలవంతం’

రెండో విడత భూముల సేకరణలో తమను వదిలేయాలని మూడు గ్రామాల అమరావతి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


అమరావతి రాజధాని రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. “మా గ్రామాలను రాజధాని పరిధి నుంచి మినహాయించాలి” అంటూ వారు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు 12 ఏళ్లు గడిచినా ప్లాట్లు కూడా అందకపోవడంతో తీవ్ర నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మూడు పంటలు పండే 195 ఎకరాలను అనవసరంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదు. ఇంకా భూసేకరణ ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు.

రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. న్యాయపరమైన పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులను కలుస్తున్నారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యను ఇటీవల కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు.

“ఇష్టపూర్వకంగా భూములిస్తేనే తీసుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు బలవంతంగా సేకరిస్తున్నారు” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏ అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. “లంక భూములు కొట్టేసి కొందరు పెద్దలు లాభపడుతుంటే, మేము మా సొంత భూములు త్యాగం చేయాలా?” అని వాపోయారు.

గుజ్జుల ఈశ్వరయ్య అభిప్రాయం

రైతుల ఉద్యమానికి సీపీఐ పూర్తి మద్దతు తెలియజేస్తోందని రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రైతులకు హామీ ఇచ్చారు. “రాజధాని పేరుతో రైతులపై బెదిరింపులు, బలవంతపు భూ సమీకరణ తక్షణం ఆపాలి” అని డిమాండ్ చేశారు.

“మొదటి విడతలోనే 55 వేల ఎకరాలు సేకరించి రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరించాలనడం సరికాదు. రాజధాని పనుల పేరుతో అప్పులు తెచ్చి ఒక్క ప్రాంతంపైనే కోట్లు వెచ్చించడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. అందుకే అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి” అని ఆయన అన్నారు.

రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడం జరుగుతోందని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఈశ్వరయ్య విమర్శించారు. రైతుల పోరాటానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఈ ఉద్యమం వామపక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అభివృద్ధి పేరుతో రైతుల భూములపై జరుగుతున్న ఒత్తిడి ఇక్కడితో ఆగకపోతే, అమరావతి ప్రాంతంలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More
Next Story