
పెట్రోల్ కోసం జనం క్యూలు
ఒక్క ఆంధ్రలోనే పెట్రోల్ కొరత ఎందుకొచ్చిందీ?
సమస్యను పసిగట్టడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమైందీ? ప్రైవేటు కంపెనీలు చేసిన కుట్ర ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మొదలు అటు అనంతపురం వరకు కర్నూలు నుంచి కుప్పం వరకు రాష్ట్రం నాలుగు చెరుకులా ఎక్కడ చూసినా పెట్రోల్ కోసం జనం క్యూలు కట్టి ఉన్నారు.
రాష్ట్రంలో సుమారు 1000కి పైగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయదారుల కోసం డీజిల్ కూపన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.
అసలు ఈ కొరత ఎందుకు వచ్చింది? మిగిలిన రాష్ట్రాల్లో లేని సమస్య ఏపీలోనే ఎందుకు తీవ్రంగా ఉంది?
ఏపీలోనే ఎందుకు ఈ పరిస్థితి?
సాధారణంగా ఏపీకి విశాఖ రిఫైనరీ (HPCL) ప్రధాన వనరు. అయితే, ప్రస్తుతం తలెత్తిన కొరతకు 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్, నాయరా వంటి వంటివి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో నష్టాలను తగ్గించుకోవడానికి తమ బంకులకు సరఫరాను భారీగా తగ్గించాయి. ఇవి మూతపడటంతో ఆ భారం అంతా ప్రభుత్వ బంకులపై (HPCL, BPCL, IOCL) పడింది.
అదనపు డిమాండ్
స్టాక్ ఉండదేమో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే పెట్రోల్ డిమాండ్ 34%, డీజిల్ 16% పెరగడం గమనార్హం.
సరఫరా చెయిన్ లోపాలు
విశాఖ రిఫైనరీలో చిన్నపాటి సాంకేతిక సమస్యలు, పైప్‌లైన్ మెయింటెనెన్స్ వల్ల డిపోలకు ఇంధనం చేరడంలో జాప్యం జరిగింది.
రంగంలోకి ముఖ్యమంత్రి..
ఈ పరిస్థితిని పసిగట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. యథాలాపంగా సాగిపోతుంది కదా అని మిన్నకుండిపోయాయి. ఇరాన్-అమెరికా యుద్ధం సాగినంతకాలం కాస్తోకూస్తో కొరత ఉంటుందని భావించింది. అది కాస్త ముదిరడంతో ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
దీనికి తగ్గట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన తండ్రి భాస్కరరావు అస్తమించడంతో ఆయన ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితిని ఆయన శాఖ అధికారులు కూడా పట్టించుకోలేదు. దాంతో నియంత్రణ లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే సమస్యను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.
సోమవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా సాధారణ స్థితికి రావాలని, ఏ బంకు వద్ద "నో స్టాక్" బోర్డులు కనిపించకూడదని గట్టిగా ఆదేశించారు.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు..
రెవెన్యూ, పోలీస్, తూనికల కొలతల శాఖలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు ఇబ్బంది కలగకుండా కూపన్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈమేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. అప్పటికప్పుడు కూపన్లు తయారు చేసి రైతులకు అందిస్తున్నారు.
ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది?
రాష్ట్రానికి ఇంధన సరఫరా ఎలా ఉంటుందంటే.. విశాఖలోని హెచ్.పి.సి.ఎల్. నుంచి పైప్‌లైన్ ద్వారా విజయవాడ (కొండపల్లి), రాజమండ్రికి సరఫరా అవుతుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెన్నై రిఫైనరీ (CPCL) నుంచి ఇంధనం వస్తుంది. ఉత్తరాంధ్రకు ఒడిశాలోని పారాదీప్ (IOCL) నుంచి సరఫరా జరుగుతుంది.
ప్రభుత్వ హెచ్చరిక - కంపెనీల బాధ్యత
ఆయిల్ కంపెనీలు రిటైల్ అవుట్‌లెట్లకు క్రెడిట్ ఇవ్వకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడితే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రస్తుతం రాష్ట్రంలో 4,510 బంకులు ఉండగా, అందులో 421 బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. మరో 600కి పైగా అనధికార మూసివేతను ప్రకటించాయి. దీంతో జనం పక్కఊళ్ల మీదకు ఎగబడ్డారు.
వాహనదారులు ఆందోళన చెంది ట్యాంకర్ల కొద్దీ ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, అవసరానికి తగినట్లుగా మాత్రమే కొనుగోలు చేసి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇటీవల విశాఖ రిఫైనరీలో చిన్నపాటి సాంకేతిక సమస్యలు రావడం కూడా సరఫరాలో జాప్యానికి ఒక కారణమని డీలర్లు చెబుతున్నారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖ విభాగాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కూపన్ విధానం ప్రవేశపెట్టారు.
రిటెయిల్ ఔట్‌లెట్లకు గతంలో ఇచ్చినట్లు క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. కంపెనీలు, రిటెయిల్ ఔట్‌లెట్ల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదన్నారు. నిత్యావసరాలకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Next Story

