
అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వచ్చిన తమ్ముడు.. ఏం జరిగిందంటే..
తన అక్క ఖాతాలోని డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె చనిపోయిందని చెప్పడానికి రుజువుగా ఆమె ఆస్తి పంజరాన్ని బ్యాంకుకు తీసుకొచ్చాడు.
మరణించిన తన అక్క బ్యాంకు ఖాతాలోని రూ.20వేలు తీసుకోవడానికి ఒక గిరిజనుడు చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒడిశా రాష్ట్రం కియోంఝర్ జిల్లా దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) అనే వ్యక్తి అక్క కల్రా ముండా (56) బ్యాంకు ఖాతాలో రూ.20 వేలు జమ అయ్యాయి. అయితే ఆమె జనవరి 26, 2026న చనిపోయింది. ఈ క్రమంలో తన అక్క ఖాతాలోని రూ. 20వేలు డ్రా చేసేందుకు జీతూ ముండా బ్యాంకుకెళ్లాడు. మీ అక్కను తీసుకువస్తేనే డబ్బులిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే ఆమె చనిపోయిందని జీతూ ముండా బ్యాంకు అధికారులకు చెప్పాడు. అలాగయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకువస్తే డబ్బులిస్తామని చెప్పారు. చాలాసార్లు బ్యాంకుకు వెళ్లినా బ్యాంకు అధికారులు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. చివరకు విసుగు చెందిన జీతూ ముండా, తన అక్క మరణానికి సాక్ష్యంగా సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లాడు. నివ్వెరపోయిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జీతూను అదుపులోకి తీసుకుని విషయం తెలుసుకున్నారు.
‘అక్క చనిపోయిందని చెప్పినా వినిపించుకోలేదు..’
“నేను చాలాసార్లు బ్యాంకుకు వెళ్లాను. వాళ్లు ఖాతాదారురాలిని తీసుకురమ్మని చెప్పారు. ఆమె చనిపోయిందని చెప్పినా వినలేదు,” అని జీతూ ముండా తెలిపారు. “అందుకే విసుగు చెంది, ఆమె మరణానికి సాక్ష్యంగా సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకొచ్చాను,” అని జీతూ చెప్పారు.
“జీతూ నిరక్షరాస్యుడు. నామినీ, చట్టబద్ధ వారసత్వ విషయాలు అతనికి తెలియవు,” అని పటానా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ప్రసాద్ సాహు తెలిపారు. “జీతూకు బ్యాంకు అధికారులు అర్థమయ్యేలా చెప్పకపోవడంతో ఇలా జరిగింది,” అని ఆయన చెప్పారు. చివరకు జీతూ ముండాకు అవసరమైన సాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం పోలీసుల సమక్షంలో అస్థిపంజరాన్ని మళ్లీ శ్మశానంలో పూడ్చిపెట్టారు.
ఈ ఘటనపై స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మానస్ దండపత్ స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. “ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. సమస్య పరిష్కారం కోసం చర్య తీసుకుంటాను,” అని చెప్పారు.
కల్రా ముండా ఖాతాలోని నామినీ కూడా మరణించడంతో జీతూ ముండా ఒక్కడే చట్టబద్ధ హక్కుదారుడు. చివరకు నిబంధనల ప్రకారం డబ్బు అందేందుకు స్థానిక యంత్రాంగం జీతూ ముండాకు సాయం చేసింది. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగంపై అవగాహన లోపం, చట్టపర ప్రక్రియల్లో క్లిష్టత, అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.

