ఇక కలెక్టర్లకు ర్యాంకులు
x

ఇక కలెక్టర్లకు ర్యాంకులు

ప్రశ్నార్థకంగా మారిన క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చ.


రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి జిల్లా కలెక్టర్ల సదస్సుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 7, 8 తేదీల్లో సచివాలయం కేంద్రంగా జరగనున్న ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా, జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించనుండటం ఇప్పుడు అధికార యంత్రాంగంలో పెను సంచలనంగా మారింది. పాలనా దక్షత, అభివృద్ధి పనుల వేగం, రెవెన్యూ నిర్వహణలో కలెక్టర్ల పనితీరును బేరీజు వేసి, ఏ జిల్లా ఎక్కడ ఉందో తేల్చి చెప్పేందుకు ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డ్ సిద్ధం చేసింది. ఈ పాలనా పరీక్షలో ఏ జిల్లా టాపర్‌గా నిలుస్తుంది? ఏ జిల్లా వెనుకబడి ఉంది? అనే అంశం ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స్వర్ణాంధ్ర లక్ష్యంగా తొలి రోజు అడుగులు
సదస్సు తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌పై దిశానిర్దేశం చేయనున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టే క్రమంలో పేదరిక నిర్మూలన, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, డీప్-టెక్ వంటి కీలక రంగాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల వారీగా సాధించిన జీఎస్‌డీపీ (GSDP) వృద్ధిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. విశాఖ, విజయనగరం, చిత్తూరు వంటి జిల్లాల విజయగాథలను వివరిస్తూనే, కొత్తగా ఏర్పడిన జిల్లాల పురోగతిని కూడా సమీక్షించనున్నారు.
సంక్షేమంపై ప్రజల నాడి.. ఈ-ఆఫీస్ స్పీడ్
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ-ఆఫీస్ విధానం, ఫైళ్ల పరిష్కారంపై సీఎస్ సాయిప్రసాద్ కీలక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత రెండు నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు ఎంత వేగంగా స్పందిస్తున్నారు? అనే అంశాలపై సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఇచ్చే నివేదిక కలెక్టర్ల పనితీరుకు అద్దం పట్టనుంది. పెట్టుబడుల ఆకర్షణ, వాటి గ్రౌండింగ్ అంశం తొలి రోజు సదస్సులో ముగింపు చర్చగా ఉండనుంది.
శాంతిభద్రతలు, సూపర్ సిక్స్
రెండో రోజు సదస్సు మరింత కీలకం కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుపై సుదీర్ఘ చర్చ జరగనుంది. విద్య, వైద్యం, న్యాయశాఖ అంశాల తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితిపై కలెక్టర్లు మరియు ఎస్పీలతో సీఎం భేటీ కానున్నారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా రాష్ట్రవ్యాప్త నివేదికను సమర్పించగా, జిల్లాల వారీగా ఉన్న క్లిష్ట పరిస్థితులపై ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నేర నియంత్రణ, పారదర్శక పాలనపై సీఎం అధికారులకు కఠినమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
క్షేత్రస్థాయి సవాళ్లు
అయితే, ఈ సదస్సు అజెండాపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 7వ విడత సదస్సు కూడా పాత రోటీన్ అంశాల చుట్టూనే తిరుగుతోందని, నడివేసవిలో ఎదురయ్యే తాగునీటి ఎద్దడి, ఎండల తీవ్రత వంటి అత్యవసర అంశాలకు తక్కువ సమయం కేటాయించారనే వాదన ఉంది. గతంలో సీఎం చంద్రబాబు ఆదేశించిన పల్లె నిద్ర కార్యక్రమం, కలెక్టర్ల గ్రామ పర్యటనల పురోగతిపై రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటికీ స్పష్టమైన నివేదిక లేకపోవడం గమనార్హం. ఈ సదస్సులోనైనా ఈ క్షేత్రస్థాయి పర్యటనలపై ప్రత్యేక పోర్టల్, పర్యవేక్షణపై స్పష్టత వస్తుందో లేదో వేచి చూడాలి.
Read More
Next Story